అంబులెన్సులను ఆపే అధికారం ఎవరిచ్చారు

 అంబులెన్సులను ఆపే అధికారం ఎవరిచ్చారు

జాతీయ రహదారులపై హక్కు కేంద్రానిదే- సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు

భూమిపుత్ర,హైదరాబాద్:

తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌లను ఆపడంపై హైకోర్టు మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని ఆపడం ఎవరిచ్చిన అధికారమని ప్రశ్నించింది. అంబులెన్స్‌లను ఆపడానికి తెంగాణ సర్కార్‌కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్‌ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ నుంచి కరోనా బాధితులు వస్తున్నారని కోర్టుకు ఏజీ విన్నవించారు. ప్రతి పేషేంట్‌కు ఆస్పత్రి అడ్మిషన్‌ ఉండాలని ఏజీ అన్నారు. తాము ఆదేశాలు ఇచ్చినా సర్క్యులర్‌ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆంబులెన్సులను ఆపుతున్న అధికారులతో మాట్లాడుతున్న కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

ఆర్టికల్‌ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్‌ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని పేర్కొంది. ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణకు నాలుగు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని తెలిపారు. ఈనె 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌పై హైకోర్ట్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మాట్లాడిన ఏజీ.. రాష్ట్ర ప్రజల బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అధికారులు కరోనాపై రివ్యూ చేసి.. ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్‌ జారీ చేశారని ధర్మాసనానికి తెలిపారు. ఏజీ వాదనను ఖండిస్తూ.. ఇతర రాష్ట్రాల ప్రజలను నిలువరించడం దేనికని హైకోర్టు ప్రశ్నించింది. పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌ లు ఆపడం ఎక్కడైనా చూశామా? రైట్‌ టు లైఫ్‌ను ఆపడానికి విూకు ఏం అధికారం ఉంది? ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదు. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారు. పేషెంట్లు చనిపోతుంటే విూరు సర్క్యులర్లు జారీ చేస్తారా?సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్‌ ఉండట్లేదు. హైదరాబాద్‌లో పేషెంట్లకు ఆక్సిజన్‌ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా? గద్వాల్‌, ఖమ్మం, నిజామాబాద్‌ నుండి కూడా.. 300 కి.విూ ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు, వారిని ఆపుతున్నారా? రాజ్యాంగాన్ని విూరు మార్చలేరని అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు వ్యాఖ్యలకు ఏజీ సమాధానమిస్తూ.. అంబులెన్స్‌ను నిలువరించే ముందు సర్క్యుర్‌ జారీ చేశామని చెప్పారు. ఢిల్లీ, మహారాష్ట్రలో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా మేలు చేస్తుందని, ఇతర రాష్ట్రాల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ లేకుంటే ప్రవేశమే నిషిద్ధమని కోర్టుకు తెలిపారు. ఆస్పత్రి అనుమతి ఉంటేనే అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అయితే ఎజి వ్యాఖ్యపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంబులెన్సులనుతెలంగాణ అడ్డుకోవడం లేదు: హెల్త్‌ డైరెక్టర్

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లతో సమస్యలు వస్తున్నాయని తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఇతర ప్రాంతాల రోగుల కారణంగా తెలంగాణ కు కేటాయించిన ఆక్సిజన్‌, ఇతరత్రా మందులు వాడాల్సి వస్తోందని అన్నారు. అందుకే అనుమతులు తప్పనిసరి చేశామని అన్నారు. సరిహద్దుల్లో అంబులెన్స్‌లను అడ్డుకుంటున్నారన్నదానిపై స్పందించిన ఆయన శుక్రవారం విూడియా సమావేశంలో మాట్లాడుతూ మేం ఎక్కడా అంబులెన్స్‌ను అడ్డుకోవడం లేదన్నారు. ముందస్తుగా ఆస్పత్రుల్లో బెడ్లు బుక్‌ చేసుకున్న తర్వాతే రాష్ట్రంలోకి రావాలన్నారు.

తెలంగాణ వైద్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు

ఎవరైతే తెలంగాణ లో ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వాలని అనుకుంటున్నారో వారు బెడ్‌ రిజర్వేషన్‌ లేకుండా నేరుగా వచ్చేసి ఆస్పత్రికి వెళ్లడం, అక్కడ బెడ్‌ లేకపోతే మరో ఆస్పత్రికి వెళ్లడం.. ఇలా మొత్తంగా బెడ్‌ కోసం ఐదారు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని ఈ నేపథ్యంలో పేషెంట్లకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అదే సమయంలో స్థానికులకు కరోనా ప్రభావం చూపుతోందన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రూపొందించిందని శ్రీనివాస్‌ తెలిపారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలకు లేఖ రాసినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని శ్రీనివాస్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తెలంగాణలో ఏ ఆస్పత్రిలోనైనా బెడ్‌ రిజర్వు చేసుకోవాన్నారు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేస్తారని, అక్కడి సిబ్బంది ఒక ఫార్మాట్‌లో వివరాలు రాసుకుని వాళ్లు హెల్త్‌ కార్యాలయానికి పంపుతారని, దాంతో ఆ పేషెంట్‌ తెలంగాణ లోకి రావడానికి పర్మిషన్‌ లెటర్‌ ఇస్తామని శ్రీనివాస్‌ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు అనుమతిపై ఈ కంట్రోల్‌ రూమ్‌ పర్యవేక్షిస్తుందని, 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చాలా మంది రోగులకు తెలంగాణలో చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ నిబంధనల ప్రకారం ట్రీట్‌మెంట్‌ చేస్తున్నామని, అంతేగానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పేషెంట్లకు చికిత్స చేయమని చెప్పలేదని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ సర్క్యులర్‌పై హైకోర్టు స్టే

అంబులెన్సును ఆపొద్దని పోలీసులకు ఆదేశాలు

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. సర్క్యుర్‌లో మార్పులు చేసి కొత్త సర్క్యులర్‌ జారీ చేయాలని ఆదేశించింది. వైద్య సహాయం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పేషంట్లు కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. అంబులెన్స్‌లో వస్తున్న పేషంట్‌ ప్రవేశాన్ని కంట్రోల్‌ రూం ఆపలేదని హై కోర్టు తెలిపింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పేర్కొంది. అంబులెన్స్‌లు ఆపొద్దని తెలంగాణ పోలీస్‌శాఖకు హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయింది. ఏపీ తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలపై హైకోర్టు సానుకూలత వ్యక్తం చేసింది. రాష్ట్రాల ఎంట్రీని నిలువరిస్తే ఆర్టికల్‌ 14 ఉల్లంఘనేనని ఏపీ ఏజీ పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నె 17కు హైకోర్టు వాయిదా వేసింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *