మరణ ధృవీకరణ పత్రాల మంజూరు లో ఆలస్యం

 మరణ ధృవీకరణ పత్రాల మంజూరు లో ఆలస్యం

భూమిపుత్ర,అనంతపురం:

కరోనా మరణాలపై స్పష్టత లేకుండా పోతోందన్నది. కరోనాతో పోయినా సర్టిఫికెట్‌ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదోచోట కరోనా మరణాలు సంభవిస్తున్నా అధికారులు ధృవీకరించడం లేదు. దీంతో మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం కరువవుతోంది. కొవిడ్‌ లక్షణాలతో ఎవరైనా మృతి చెందితే ఆ కుటుంబాలను ఆదుకుంటామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినా అది అమలు కావడం లేదు. మృతుల వివరాలతో పాటు కరోనాతో మృతిచెందినట్టు ధ్రువీకరణ పత్రం జత చేసి దరఖాస్తు చేసుకుంటే ఆర్థిక సాయం అందజేస్తామని ప్రభుత్వాలు వెల్లడించాయి. కానీ, చాలా ఆస్పత్రుల్లో కోవిడ్‌తో మృతిచెందినా దీర్ఘకాలిక వ్యాధులతోనే మరణించినట్టు అధికారులు ధ్రువీకరణ ప్రతాలు జారీ చేస్తున్నారు. దీంతో మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయం అందని పరిస్థితి నెలకొంది.

కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా రోజూ పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అంతిమ సంస్కారాల కోసం తక్షణ సాయం కింద మృతుల కుటుంబాలకు రూ.15వేల చొప్పున అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనాతో 60 ఏళ్లలోపు ఇంటిపెద్ద మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం కూడా భారీగానే ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. కరోనాతో తల్లిదండ్రులు మృతిచెందితే అనాథలైన పిల్లలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఐదేళ్ల పాటు నెలనెలా భృతి చెల్లించాలని నిర్ణయించింది. గత ఏడాది మార్చి నుంచి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పథకం వర్తింపజేయనున్నట్టు ప్రకటించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఆర్థిక సాయం పొందాలంటే మరణ ధ్రువీకరణ ప్రతంలో కరోనాతో మృతి చెందినట్టు వైద్యులు పేర్కొనాలి. కానీ జిల్లాలలో ఆ పరిస్థితి లేదు.కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రుల్లో చేరిన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో ఎక్కువ మంది చనిపోవడానికి గుండెపోటు, ఊపిరితిత్తులు పాడైపోవడం, కిడ్నీ వ్యాధులు, ఇతరత్రా కారణాలే చూపుతున్నారు. వీటినే మరణ ధ్రువీకరణ పత్రాల్లో నమోదు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ సాయం తమకు అందడం లేదని కొవిడ్‌ మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో తమకు ఇక దిక్కెవరు అంటూ మృతుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి మొదలు కొవిడ్‌ ఆస్పత్రుల్లో చాలామంది దీర్ఘకాలిక వ్యాధులతోనే మృతి చెందుతున్నట్టు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మరణ ధృవీకరణలో స్పష్టత లేకపోవడంతో తమకు మాత్రం సాయం అందడం లేదని మృతుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా కొవిడ్‌తో మృతి చెందినట్టు ఆస్పత్రుల్లో ధ్రువీకరణ పత్రం అందజేసినా కొందరి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందడం లేదు. కరోనా మృతులకు అంతిమవీడ్కోలు కోసం తక్షణ సాయం కింద రూ.15వేలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు చాలా మంది మృతుల కుటుంబ సభ్యులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. కానీ వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ కావడం లేదు. ఈ నేపథ్యంలో చాలామంది ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు స్పందించి తమకు ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపట్టాలని కరోనా మృతుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published.