కర్ఫ్యూ ఆంక్షలకు ప్రజలు సహకరించాలి

 కర్ఫ్యూ ఆంక్షలకు ప్రజలు సహకరించాలి

కర్ఫ్యూ అమలును పర్యవేక్షిస్తున్న ఎస్పీ సత్య ఏసుబాబు

భూమిపుత్ర,అనంతపురం:
అనంతపురం నగరంలో కర్ఫ్యూ ఆంక్షల అమలును జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా పాతవూరులో మీడియాతో మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ఈరోజు నుండీ రెండు వారాలు పాటు (18-5-21 వరకు) కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతిరోజు మధ్యహ్నాం 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు, రెస్టారెంట్లు మూసేయాలని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుండి మధ్యహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరుచుకోవడానికి అనుమతి ఉంటుందని తెలియచేశారు. తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, ప్రింట్‌ –ఎల్రక్టానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్స్, ఇంటర్‌నెట్, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ సేవలు, పెట్రోల్‌ బంకులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ ఔట్‌లెట్‌లు, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్య సేవలు, కోల్డ్‌ స్టోరేజీలతోపాటు గిడ్డంగులు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు గుర్తింపు కార్డులు చూయించి వెళ్లవచ్చని తెలియచేశారు.

అన్ని ఉత్పాదక సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణతోపాటు అన్ని వ్యవసాయ పనులు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌ చూయించి వెళ్లొచ్చని పేర్కొన్నారు. వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగడానికి అనుమతినిస్తున్నామని తెలియచేశారు. వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్‌ టీకాలకు వెళ్లే వ్యక్తులు ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వారికి ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి ఉందన్నారు. రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్‌ ఉండాలన్నారు.
అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తామని అన్నారు.
కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే విపత్తు నిర్వహణ చట్టం కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్ఫ్యూ ఆంక్షలు అమలు సందర్భంగా మినహాయింపు కల్గిన సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించేందుకు నోడల్ అధికారి స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఉమామహేశ్వరరెడ్డి 9440796864 ను ఫోన్లో సంప్రదించవచ్చని అన్నారు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *