న్యాయస్థానాలదే కీలకపాత్ర

 న్యాయస్థానాలదే కీలకపాత్ర

భూమిపుత్ర, సంపాదకీయం:

రాజకీయాలలో ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. లోపాలను ప్రత్యర్థులే పరస్పరం బయటపెట్టుకుంటారు. అధికారపక్షంపై ప్రతిపక్షం, ప్రతిపక్షాపై అధికారపార్టీ నిరంతరం ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. నిజానికి చాలా వరకూ రెండూ నిజమే అయి ఉంటాయి. రోమ్‌ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్న నీరో చక్రవర్తిని తలపిస్తున్నారు అధికార పార్టీ నాయకులు అంటూ ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఉపద్రవం ఉప్పెనలా చుట్టుముట్టుతుంటే చుట్ట కాల్చుకుందామనుకునే సంకుచిత‘ నీరో’ మనస్తత్వంతో ప్రవరిస్తున్నారు ప్రతిపక్ష నాయకులు అంటూ అధికారపార్టీలు విమర్శిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే సాగుతోంది. ఈ కష్ట కాలాన్ని అధిగమించడానికి నా పాత్ర ఏమిటి? నీపాత్ర ఏమిటనే ఆత్మవిమర్శ మాత్రం ఎవరూ చేసుకోవడం లేదు.

ప్రధానమంత్రి రిజైన్‌ చేయాంటూ సోషల్‌ విూడియాలో మొదలైన హాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌ గా కొనసాగడంపై బీజేపీ కారాలు మిరియాలు నూరుతోంది. ఇందులో ప్రతిపక్షాల కుట్ర ఉందని అక్కసు వెలిగక్కుతోంది. గత ఏడాది తపేలాలు వాయించడం,చప్పట్లు కొట్టడం,దీపాలు పెట్టడం వంటి అహేతుకమైన చర్యలతో దాదాపు నవ్వు తెప్పించినంత పని చేసిన నరేంద్రమోదీ ఈ సారి ఉపద్రవంలో కూడా మెరుగైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.ప్రజారోగ్యం కంటే రాజకీయ ప్రాధాన్యాలకు పెద్ద పీట వేయడమే ఇందుకు కారణం. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగానే మసకబారిన ప్రతిష్ఠను మరింత దిగజార్చింది. దీంతో దేశ విదేశాల్లోని మోడీ వ్యతిరేకులంతా సోషల్‌ విూడియాలో ట్రెండ్‌ సృష్టిస్తున్నారు.దేశంలో జాతీయంగానూ, రాష్ట్రాల్లోనూ అదికార పార్టీలు చాలా అసహనంగా ఉన్నాయి. ఉద్దేశ పూర్వకం కాకపోవచ్చు కానీ తీవ్రతను గుర్తించడంలో విఫలమయ్యాయి. దానిని అంగీకరించి ప్రజలకు క్షమాపణ చెప్పి , సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయవచ్చు. విమర్శలకు అతీతంగా తమ పని తాము చేసుకుపోవచ్చు. కానీ అహం అడ్డువస్తోంది. తాము సమర్థులమని, తమ తప్పేం లేదని చెప్పడానికే అధికార పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.

ప్రధాని రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ నిర్లక్ష్యం చేశారు . పొరపాటు అంచనాలతో కరోనా పట్ల నిర్లక్ష్యం వహించారు. ఇది నిజం. దేశంలో మీడియాను కూడా అధికారపార్టీలకు వ్యతిరేకంగా వార్తలు వేయకుండా నయానో భయానో నియంత్రించారు. కానీ ప్రస్తుతం ప్రపంచ మీడియా వేలెత్తి చూపుతోంది. భారత్‌ మీడియా ద్వైదీ భావం కూడా ఇందుకు కారణం. దేశీయ మీడియా ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలనే విషయమై నిలదీయడంలో సరైన మార్గదర్శకత్వం వహించడం లేదు. ఫలితంగానే ఇండియాలో జరుగుతున్న విషయాలపై అంతర్జాతీయ మాధ్యమాలు ఆసక్తి కనపరచాయి .ఏదేమైనా దేశ ప్రతిష్ఠ బజారున పడింది. మన దేశం నుంచి విమాన యానంపై నిషేధాలు, ఆంక్షలు విధిస్తున్నాయి వివిధ దేశాలు. యూనియన్‌ ప్రభుత్వమే కాదు, రాష్ట్రాలు సైతం ఈ విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ని చవి చూస్తున్నాయి.ప్రతిపక్షాలు బాధ్యతాయుతమైన పాత్రలో లేవు.

ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఉండగానే ఎన్నికలు పెట్టాని పట్టుబట్టి రాజకీయ సమరం చేసింది తెలుగుదేశం. అప్పటికింకా కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ప్రభుత్వం తనకు నచ్చిన కమిషనర్‌ ను నియమించుకుంటే రాజకీయంగా టీడీపీకి ఏదో అన్యాయం జరిగిపోతుందని ఆ పార్టీ బావించింది. తాజాగా తిరుపతి ఉప ఎన్నికలలో అధికారపార్టీకంటే ఎక్కువగా ర్యాలీలు, సమావేశాలతో చంద్రబాబు, లోకేశ్‌ సహా టీడీపీ అగ్రనాయకులు హడావిడి చేశారు. ఎన్నికల తంతు ముగిసిన వెంటనే కరోనా గుర్తుకు వచ్చింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలు ఆపాంటూ ఉద్యమం చేస్తామంటున్నారు లోకేశ్‌. ప్రతిపక్ష అగ్రనాయకులిద్దరూ హైదరాబాద్‌ కు పరిమితమవుతూ, అక్కడే నివసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ లో ఉద్యమమేమిటని ఎగతాళి చేస్తోంది అధికార వైసీపీ. తెంగాణలో బీజేపీ, కాంగ్రెసు కూడా ఖమ్మం, వరంగల్‌ వంటి చోట్ల తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి పాకులాడుతున్నాయి. ఎన్నికలనేవి ఆయా పార్టీలకు ప్రజ ప్రాణాల కంటే ప్రతిష్ఠాత్మకంగా మారడమే విషాదం.ఉన్నత న్యాయస్థానాలకు సకాలంలో జోక్యం చేసుకునే అధికారం ఉంది. కానీ అంతా అయిపోయాక సూక్తులు చెప్పడం విచిత్రంగా కనిపిస్తోంది.

ప్రజాస్వామ్య ప్రక్రియ కంటే పౌరుల ప్రాణాలు అత్యంత విలువైనవి. జీవించే హక్కు ప్రాథమిక హక్కుల్లో భాగం. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఎన్నికల కమిషన్‌ అడ్డగోలు నిర్ణయాలతో రెచ్చిపోతుంటే అడ్డుకట్ట వేసే అధికారం కోర్టుకు ఉంటుంది. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవిూ చేయలేవు. కానీ పశ్చిమబెంగాల్‌ హైకోర్టు వ్యాఖ్యలు, తాజాగా తమిళనాడు హైకోర్టు వ్యాఖ్యలు చేతులు కాలిన తర్వాత ఎన్నిక కమిషన్‌ కు సూక్తులు చెబుతున్న తీరును తలపించాయి. గడచిన ఆరునెలలుగా ప్రభుత్వాలు పూర్తిగా రాజకీయాల వైపు దృష్టి పెట్టాయి. ఎన్నికల కమిషన్‌ తో పాటు అన్ని వ్యవస్థలూ వేరే గ్రహంలో ఉన్నట్లుగానే ప్రవర్తించాయి. ఫలితంగానే కరోనా విజృంభణ కు దారి తీసింది. న్యాయస్థానాలైనా తమకున్న విశేష రాజ్యాంగాధికారాలతో జోక్యం చేసుకుని ఉంటే పరిస్థితులు చక్కబడి ఉండేవి. ప్రభుత్వాలు తమ తీరును పునరాలోచన చేసుకుని ఉండేవి.

Related News

Leave a Reply

Your email address will not be published.