మందులేని జబ్బుకు అంత డబ్బెందుకు?

 మందులేని జబ్బుకు అంత డబ్బెందుకు?

భూమిపుత్ర, ఆరోగ్యం :

మందులేని జబ్బుకు అంతింతేసి డబ్బులు ఖర్చు ఎందుకవుతాయని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు.వీళ్ళకు ఏదైనా ఒక జబ్బు అంటే ఏమిటో మానవ శరిరం అంటే ఏమిటో అణులేశమాత్రం కూడా తెలియదు అని చెప్పవచ్చు. అందుకే అలా మాట్లాడుతూ ఉంటారు.”కూరలో ఉప్పు లేదు. ఉప్పువేస్తే సరిపోతుంది కదా!” అని అనుకున్నంత సులువుగా మన శరీరంగానీ ఒక జబ్బుకానీ ఉండవు.ఉదాహరణకు కరోనా. కరోనా అనేది మన శ్వాస వ్యవస్థలో పై భాగాలకు సోకే జబ్బు. అంటే ముక్కు , గొంతు. అంతవరకే. కానీ వైరస్ ఒక సారి ఎంటర్ అయ్యాక అది గొంతు వరకే ఆగిపోతే దానిని జబ్బు అంటారు. కానీ గొంతును దాటి అది మరేం చేసినా వాటిని “కాంప్లికేషన్లు” అంటారు.

ఏ జబ్బుకైనా జబ్బు కంటే జబ్బువలన వచ్చే కాంప్లికేషన్లు చాలా తీవ్రమైనవి. ప్రమాదకరమైనవి.అందుకే నిజమైన వైద్యం జబ్బుతో పాటు జబ్బుతో వచ్చే కాంప్లికేషన్లను అరికట్టగలుగుతుంది. ఉదాహరణకు టీ.బీ. టీబీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. కానీ చిన్నపిల్లలకు సోకినపుడు అది మెదడుకు పాకుతుంది. ఇది దాని కాంప్లికేషన్. పిల్లలకు టీబీ వస్తే చనిపోరుకానీ “మెదడుకు పాకడం” అనే ఈ కాంప్లికేషన్ వస్తే చనిపోతారు ఫిట్స్ వచ్చి పిల్లలు చనిపోతారు. అలా జరగకుండా ఉండేందుకే పిల్లలకు బీసీజీ వాక్సిన్ ఇస్తారు. అంటే ఒకవేళ ఆ పిల్లల ఊపిరితిత్తులకు టీబీ వస్తే అది మెదడుకు పాకకుండా ఈ వాక్సిన్ కాపాడుతుంది.

అలాగే మీజిల్స్ జబ్బు వచ్చి పిల్లలలో జ్వరం రాష్ వస్తుంది. ఇది వారం రోజుల్లో తగ్గిపోవచ్చు. కానీ దాని కాంప్లికేషన్ ఏంటంటే అది జెనైటల్ గోనాడ్స్ మీద దాడిచేసి వాళ్ళు పెద్దగయ్యాక వాళ్ళలో sterility ని కలిగిస్తుంది. ఇది జరగకుండా ఉండేందుకే మీజిల్స్ వాక్సిన్ ఉంటుంది.ఇపుడు కరోనా. కరోనా సోకిన వాళ్ళలో భవిష్యత్తు లో ఏమైనా కాంప్లికేషన్లు కలిగిస్తుందేమో తెలియదు. వాక్సిన్ ఈ కాంప్లికేషన్లనుండి కాపాడుతుందనేది మాత్రం తథ్యం.

కరోనా వైరస్ గొంతులో పది రోజులే ఉండగలదు. గొంతు వరకే ఆగిపోతే జబ్బు తీవ్రత ఏమీ ఉండదు. దానికి ట్రీట్మెంట్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. కానీ కరోనా కొంతమందిలో గొంతు వరకే ఆగదు. అది కొన్ని కాంప్లికేషన్లను కూడా వెంటనే కలిగిస్తుంది. దానిలో ముఖ్యమైనది న్యూమోనియా. అంటే ఊపిరితిత్తులలో వైరల్ ఇన్ఫెక్షన్. ఈ కాంప్లికేషన్ కేవలం ఒకటి మాత్రమే కాదు. ఇది ఎన్నో ఇతర కాంప్లికేషన్ల సమాహారం.

ఒకసారి ఊపిరితిత్తులలోకి వెళ్ళిన వైరస్ అక్కడే ఉండిపోదు. అక్కడి నుండి రక్తం లోకి పోతుంది. గుండెకు పోతుంది. కిడ్నీలకు పోతుంది. బ్రెయిన్ కి పోతుంది. వైరస్ రక్తంలోకి చేరగానే రక్తం చిన్న చిన్న ముద్దలుగా ఉండలు కట్టడం జరుగుతుంది. ఆ ఉండలు ఊపిరితిత్తుల మీద పేరుకుపోవడం వలన ఊపిరితిత్తులు ఆక్సిజన్ ను పీల్చుకోలేక ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. ఊపిరితిత్తులను పని చేయించే కండరాలలో కూడా రక్తపు ముద్దలు పేరుకుపోయి..వాటికి ఆక్సిజన్ అందక అవి కూడా బలహీనమైపోయి అలసిపోయి..”ఇక మావల్లకాదు” అని చేతులెత్తేస్తాయి. చతికిలబడతాయి. చూశారా…ఇవన్నీ దాని కాంప్లికేషన్లు.

ఐతే ఇది ఇక్కడితో ఆగలేదు. వైరస్ రక్తంలో చేరినందుకు మన శరీర ఇమ్యూనిటీ సిస్టం కూడా అతిగా స్పందిస్తుంది. ఒకమేరకు స్పందిస్తే ఇబ్బంది లేదు. కానీ అతిగా స్పందించే సరికి సైటోకైన్ లు తుఫానులాగా విరుచుకపడతాయి. అవి రక్తపు గడ్డలను మరింతగా పెంచుతాయి. శరీరాన్ని మొత్తాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ లోకి తీసుకుపోతాయి. రక్తంలో ఆక్సిజన్ తగ్గడంవలన యాసిడ్స్ పెరిగిపోతాయి. ఈ యాసిడ్స్ ని తగ్గించేందుకు మన శరీరంలో ఉండే క్షారాలు విజృంభిస్తాయి. మొత్తానికి యాసిడ్ బేస్ ల బ్యాలెన్సు దెబ్బతింటుంది. ఇవన్నీ కూడా కాంప్లికేషన్లు.

కరోనాకి మందు లేదు అంటే కరోనా వైరస్ ను చంపడానికి మాత్రమే మందులేదు. దానిని వైరిసిడల్ మందు అంటారు. అది మాత్రమే లేదు. ఇంకా కనుక్కోలేదు. కానీ కరోనా కలిగించే సకల కాంప్లికేషన్లకూ వైద్యం ఉంది.కరోనా గొంతులో చేరాక అక్కడినుండి ఊపిరితిత్తులకు పాకాక అక్కడి కణాలలో లక్షల కొద్దీ రెప్లికేట్ ఔతుంది. అంటే ఒకటి రెండుగా..రెండు నాలుగుగా..నాలుగు ఎనిమిదిగా..ఎనిమిది పదహారుగా సంఖ్య గంటల్లో పెంచుకుంటూ పోతుంది. దాని సంఖ్యను అలా పెంచుకోకుండా రెమ్డెస్వీర్ అనే మందు ఉంది. ఐతే ఇది అందరికి అవసరం లేదు. వైరస్ పదిరోజులూ గొంతులోనే ఉండిపోతే ఇది ఈయనవసరం లేదు. ఊపిరితిత్తులలో చేరి దగ్గు విపరీతమైనప్పుడే..అది కూడా పదిరోజులలోపు ఇలా జరిగినపుడే దానిని ఇస్తారు.

అలాగే రక్తంలో గడ్డలు ఏర్పడటం..మైక్రో థ్రోంబై ఏర్పడటం..కండరాలకు కిడ్నీకి గుండెకూ లివర్ కూ రక్త సరఫరా తగ్గడం. ఆక్సిజన్ శాతం తగ్గి ఊపిరితిత్తుల కండరాలు అలసిపోయి చేతులెత్తేసిపుడు ఆసిడ్ బేస్ బ్యాలెన్సు దెబ్బతిని కిడ్నీలు దెబ్బతిన్నప్పుడూ..వీటన్నింటికీ ట్రీట్మెంట్ ఉంది. ఈ సకల రకాల కాంప్లికేషన్లు రాకుండా చేయడం, ఒకవేళ వచ్చినా.. వాటిని సరైన మందులతో, వెంటిలేటర్ వంటి వాటి సహాయంతో బాగు చేయడం ఉంటుంది. ఇలా చేయాలంటే గంటగంటకూ రోగి శరీరంలో వస్తూన్న మార్పులను గమనిస్తూ చేయవలసి ఉంటుంది.

ఒక్కో పేషంట్ ఒక్కో రకమైన ఈ తీవ్ర కాంప్లికేషన్లలోకి పోతూ ఉంటాడు. మెల్లిగా మొదలై గంటగంటకూ మరింత కాంప్లికేషన్లలోకి పోవచ్చు. ఎప్పటికప్పుడు రక్త నమూనాలు గమనిస్తూ ఉండాలి. ఎవరు ఎలా కాంప్లికేషన్లలోకి పోతారో వారికి ఆయా ట్రీట్మెంట్ మొదలౌతుంది. ఎంత జాగ్రత్తగా చేసినా కొందరిలో కోలుకోలేనంత డ్యామేజీ జరుగుతుంది. కొందరు పల్మనాలజిస్టులు ఐసీయూలో కుర్చీ వేసుకుని కూర్చుని రాత్రులంతా క్షణ క్షణం మానిటర్ చేస్తున్నారు. ప్రతి పేషంట్ కి కనెక్ట్ చేసిన మానిటర్ లు ఒకేఒక కంప్యూటర్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఒకడాక్టర్ నాలుగు వందల ఐసీయూ పేషంట్లను చూసుకుంటున్న పరిస్థితి ఉంది. ఎవరిలో ఏ మార్పు వస్తుందో దానినిబట్టి పేషంట్లను అటెండ్ ఔతుంటారు. అక్కడే కుర్చీమీద నడుంవాల్చి పడుకునేవారు ఉంటారు. ఇవన్నీ చేస్తేగానీ కొందరైనా బతికి బయటపడగలుగుతున్నారు. కానీ ఇంత చేస్తున్నా డాక్టర్లు ఏం చేస్తున్నారని అడిగే వెధవలు ఉంటారు.

ప్రాణాలకు తెగించి ఇంటివాళ్ళను నిద్రనూ మరిచి చేస్తున్నా కృతజ్ఞత లేని మూర్ఖులు. డబ్బులు గుంజుతున్నారని మళ్ళీ. అంత కాంప్లికేషన్లకు ఆ ఖర్చు తప్పక ఔతుంది. ఒక స్పెషాలిటీ హాస్పిటల్ లో కనీసం వేయి మంది స్టాఫ్ ఉంటారు. వారి కుటుంబాలుంటాయి. ఇపుడున్న పరిస్థితి లో వీరందరూ కుటుంబాలు మరిచి పని చేస్తున్నారు. వాళ్ళను పని చేయించడానికి ఫీజు చెల్లింపుల్లో భారీ మార్పులు వచ్చాయి.మొన్న ఒక డాక్టర్ అన్నాడు. “ఐసీయూలో ఉండే ఒకే ఒక్క పేషంట్ కి ఏమేమి చేయాలో మొత్తం నేను నేర్పిస్తాను. నాలాగా వచ్చి ఐసీయూలో చనిపోయే పేషంట్ల మధ్యన ఒక్కరోజు చేయమనండి. ఫీజు ఏమి ఖర్మ హాస్పిటల్ మొత్తం రాసిస్తాను” అని. నిజంగా ఇలాంటి సవాల్ ని తీసుకునే దమ్ము ఉందా ఎవరికైనా?ఇంత కాంప్లికేషన్లు రావడానికి కారణం కూడా జబ్బు మొదలైన మొదటికొద్ది రోజుల్లో పేషంట్లు తత్సారం చేయడం. డాక్టర్లకు తెలియకుండా సొంత వైద్యం చేసుకోవడం. అంతకుమించి అసలు కరోనా రావడానికి కారణం.

మాస్కు పెట్టుకోకపోవడం. ఫిజికల్ డిస్టాన్సింగ్ పాటించకపోవడం. మనకు సినిమాలు, సభలు, పెళ్ళిల్లు‌, పార్టీలు అన్నీ కావాలి. అన్ని ఎంజాయ్మెంట్లూ కావాలి. కానీ అనారోగ్యంతో ప్రాణాపాయస్థితి వస్తే ప్రాణాన్ని పణంగా పెట్టి చేస్తున్న వైద్యం మాత్రం సులువుగా దొరికేయాలి అంటే ఎలా?. అసలు బేసిక్ జాగ్రత్తలు తీసుకుని ఉండింటే అసలీ వేవ్ వచ్చేదే కాదుగా..!మనదేశంలో వైద్యం పూర్తిగా ప్రభుత్వ పరం చేయగల నాయకులు వస్తే బాగుంటుంది కదూ. మనమెపుడూ ఆ డిమాండ్ చేయనేలేదే!.

డా.విరించి విరివింటి

డాక్టర్ విరించి విరివింటి., వైద్యులు

Related News

Leave a Reply

Your email address will not be published.