కరోనా పరీక్షల కోసం క్యూలు కడుతున్న జనం

 కరోనా పరీక్షల కోసం క్యూలు కడుతున్న జనం

భూమిపుత్ర, అనంతపురం:

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో  ఏ చిన్న లక్షణం కనిపించినా ప్రజలు పరీక్షలు చేయించుకునేందుకు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. వైద్య సిబ్బంది వారి నుంచి శాంపిళ్లు సేకరిస్తున్నారు. రోజుకు అధికారిక లెక్క మేరకు జిల్లా వ్యాప్తంగా సుమారు పదివేలకు పైగా నమూనాలు సేకరిస్తున్నారు. సేకరించిన నమూనాలను ఐడీలు సృష్టించి సమాచారాన్ని పొందుపరచి ప్రయోగశాలకు వెంటనే తరలించినట్లయితే ఫలితాలు కూడా అంతే తొందరగా వెల్లడయ్యే అవకాశం ఉంది. వెంటనే ఆసుపత్రిలో చేరిపోయి వైద్యుల పరదవవేక్షణలో ఉండి ప్రాణాలు కాపాడుకోవచ్చు. అలా కాకుండా మారుమూల ప్రాంతాలలో సేకరించిన నమూనాలను ప్రయోగశాలకు తరలించడంలో ఆలస్యం అయితే మాత్రం ప్రమాదకరమే. నమూనాలు ఇచ్చిన ప్రజలు ఫలితం కోసం ఎదురు చూస్తూ ప్రయోగశాల సిబ్బంది నిర్లక్ష్యమని అనుకుంటున్నారే తప్ప అసలు సమస్య వారికి తెలియదు. వాస్తవానికి జిల్లాలో ప్రయోగశాల సామర్థ్యం రోజుకు సుమారు ఆరువేల టెస్టులు చేసేందుకు అనుగుణంగా ఉంటే పదివేల నమూనాలు సేకరించి ప్రయోగశాల సిబ్బంది మీద పని ఒత్తిడి పెంచుతున్నారు. ఎక్కడైతే నమూనాల సేకరణ జరుగుతుందో అక్కడినుండి నమూనాల తరలింపు బాధ్యతను ఒకరికి అప్పచెప్పి నిర్ణీత సమయంలోగా ల్యాబ్ కు చేర్చకపోతే చర్యలుంటాయంటే తప్ప ఫలితాలు తొందరగా వెల్లడయ్యే అవకాశం ఉండదు. సేకరించిన నమూనాల సంఖ్యకు అనుగుణంగా సాంకేతిక,వైద్య సిబ్బందిని నియమించకుండా మసిపూసి మారేడుకాయ చేసేలాగ అధికారులు ప్రకటనలకే పరిమితమైతే ప్రయోజనం లేదని‌ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాలా మంది కరోనా భయంతో టెస్టింగ్‌ ఫలితం రాకపోయినా ఆస్పత్రుల్లో చేరిపోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.  ఇదిలా ఉండగా రోజురోజుకు వందల్లో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో చేరే బాధితుల సంఖ్య అదేస్థాయిలో ఉంటోంది. దీంతో ఏ ఆస్పత్రిలో చూసినా బెడ్ల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆర్డీటీ ఆస్పత్రిలో 300 బెడ్లను ప్రారంభించినప్పటికీ అంతకుమించి కరోనా బాధితులు అక్కడ చేరేందుకు క్యూ కడుతున్నారంటే బెడ్ల కొరత ఎంతలా ఉందో అర్థమవుతోంది. జిల్లాలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్యను స్పష్టంగా వెల్లడించడంలో స్పష్టత కరువవుతోంది. రాష్ట్ర బులెటిన్ లో ఇప్పటి వరకూ జిల్లాలో 623 మంది కరోనాతో చనిపోయినట్లు చూపుతున్నారు. జిల్లా అధికారులు ప్రకటించిన మేరకు 653 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. రాష్ట్ర బులెటిన్ లో చూపుతున్న సంఖ్యకు, జిల్లాలో ప్రకటిస్తున్న లెక్కలకు మధ్య తేడా భారీగా కనిపిస్తోంది. కరోనా మలివిడత కమ్ముకొస్తున్న నేపథ్యంలో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతినకుండా, వాణిజ్య, వ్యాపార సముదాయాలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా, కరోనా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాల్సిన జిల్లా యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైరస్‌ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు వ్యాధి నిర్దారణ పరీక్షలను పెంచాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు కనిపించడం లేదు. బస్సులు, బహిరంగ ప్రదేశాలు, సినిమా హాళ్లు, టీ కేఫ్‌ లు, రెస్టారెం ట్లు, బార్లు, దుస్తుల దుకాణాలు, బ్యాంకులు, కూరగాయల మార్కెట్లు ఇలా ఎక్కడ చూసినా జనం గుంపులు గా ఉంటున్నా వారిని నియంత్రించేవారు కనిపించడం లేదు.జిల్లాలో కరోనాను ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామంటూ జిల్లా యంత్రాంగం లెక్కలు చూపిస్తోందే తప్ప క్షేత్రస్థాయిలో అందుకనుగుణంగా పరిస్థితులు కనిపించడం లేదు. బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *