ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

 ఐరోపా దేశాలను వణికిస్తున్న కరోనా

భూమిపుత్ర,సంపాదకీయం:

కరోనా వైరస్ తన విజృంభణ ను ఇప్పట్లో చాలించేలా కనిపించడంలేదు. మహమ్మారి మరోమారు యూరప్‌ దేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తోంది. అక్కడక్కడా పలు దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్నాయి. చైనాలో సైతం కేసులు పెరుగుతున్నాయి. మనదేశంలోనూ లెక్కలోకి రాని కేసులు, మరణాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గించి చూపిస్తున్నారు. ఎలాంటి ఉధృతి లేకుండా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి, రెండో వేవ్‌ల కంటే వేగంగా థర్డ్‌వేవ్‌ ఉండబోతోందన్న భయం పాశ్చాత్య దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. మనదేశంతో పోలిస్తే అక్కడ వ్యాక్సిన్‌ కూడా తక్కువే. మనదేశంలో ఇప్పటికే మెజార్టీ ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకున్నారు.చిన్నపిల్లలకుకూడా వ్యాక్సిన్‌ వేయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా, రష్యా లాంటి దేశాల్లో మళ్లీ కరోనా తిరగబెడుతోంది.

సెకండ్‌ వేవ్‌ వ్యాప్తి సమయంలో మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు పాటించిన ప్రజలు.. ప్రస్తుతం వాటిని పూర్తిస్థాయిలో విస్మరించినట్టుగా తెలుస్తోంది. పోలీసులు మాస్క్‌ ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నా అది స్వల్ప మోతాదులోనే జరుగుతోందన్న వాదన వినిపిస్తోంది. కాగా ఇప్పటికైనా మేల్కొనకపోతే ముప్పు ముంచేసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ప్రజలు మళ్లీ జాగ్రత్తలు మరిచారు. మాస్కులు ధరించడం మరిచారు. అలాగే భౌతిక దూరం పాటించడం మరిచారు. అలగే పెళ్లిళ్లు,పేరంటాలు, పార్టీలు మళ్లీ జోరందుకున్నాయి. ప్రజలు కరోనా వచ్చిపోయిందన్న స్పృహలేకుండా మామూలుగా తిరిగేస్తున్నారు. ఇదే పెద్ద ప్రమాదంగా మారుతోంది. మనదేశమే తీసుకుంటే కేరళ, కర్నాటక, తమిళనాడుల్లో చాపకింద నీరులా కేసులు పెరుగుతున్నాయి. దీంతో థర్డ్‌వేవ్‌ అన్న భయం అందరిలోనూ మొదలైంది. దీనికి జిల్లాల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు అద్దం పడుతున్నాయి.

సెకండ్‌వేవ్‌ సద్దు మణుగుతోందనుకున్న సమయంలో మే, జూన్‌ నెలల్లో కరోనా వేరియంట్లు వస్తున్నాయని ప్రచారం జరిగింది. అయితే వ్యాక్సి నేషన్‌ పక్రియ వేగవంతంగా సాగడంతోపాటుగా స్వీయ రక్షణ పాటించడంతో సెకండ్‌వేవ్‌ నుంచి బయటపడ్డాం. అయితే ఆ సమయం లోనే థర్డ్‌వేవ్‌లో పిల్లలపై కరోనా పంజా విసురుతుందన్న ప్రచారం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇటీవల గురుకులాలు, ఇతర విద్యాసంస్థ ల్లో వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులు భయపెడుతున్నాయి. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వారు కొవిడ్‌ బారిన పడటం చాలా అరుదు. ఒకవేళ వారికి వైరస్‌ సోకినా ఏవిూ కాదు. ఇదీ ఇప్పటివరకు ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు. కానీ కాని ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా మొదటి వేవ్‌ బాధితుల్లో అత్యధికశాతం మంది ఇతర రోగాలున్న వారు, పెద్ద వయస్కులు మాత్రమే ఉండగా.. అది రెండో దశకు చేరుకునే సరికి ఎక్కువ మంది యువత బాధితులుగా మారారు.

క్రమంగా కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, ఇటీవల నమోదవుతున్న కేసుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లో ఉంటుండటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కానీ ప్రస్తుతం నమోదవుతున్న ఆ కేసుల్లో ఎక్కువగా చిన్నారులే బాధితులవుతున్నారని తెలుస్తోంది.ముడు నెలలు మూడేళ్లు అన్న తేడా లేకుండా 12 యేళ్లలోపు పిల్లలకు ప్రస్తుతం కరోనా నిర్దారణవుతోంది. అయితే ఇన్నాళ్లు వారికి కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కానీ ఇటీవల నమోదయ్యే కేసుల్లో మాత్రం ఆయా లక్షణాలు బయట పడుతున్నాయి. జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తుం డటంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. మొదటి దశలో చిన్నారుల్లో చాలా అరుదుగా నమోదైన పాజిటీవ్‌ కేసులు, రెండో దశలో 15 శాతం వరకు నమోదవగా కొద్ది రోజులుగా ఆ సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నట్టు తెలుస్తుండగా.. బాధితుల్లో 30శాతం మంది చిన్నారులే ఉంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు నడుస్తున్నాయి. విద్యార్థుల హాజరు శాతం కూడా గణనీయంగా పెరిగింది. అయితే ఇటీవల కొన్ని స్కూళ్లు, గురుకులాల్లో కేసుల ఘటన వెలుగు లోకి రావడం,మరికొన్ని హాస్టళ్లలోని పిల్లలకు పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో తల్లిదండ్రులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబంలోని పెద్దలకు అంతగా ముప్పు లేదని భావిస్తున్న సమయం లో చిన్నారుల్లో లక్షణాలు బయటపడుతుండంటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఒకవైపు సీజనల్‌ జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు పాజిటివ్‌ కేసులతో వణికిపోతున్నారు. దీంతో పిల్లలని పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లకు పంపాలంటేనే భయపడు తున్నారు. కానీ పెద్దల నుంచే పిల్లలకు కొవిడ్‌ సోకుతోం దన్న అభిప్రాయం వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పిల్లల్లో నమోదయ్యే కేసుల్లో హాస్టళ్లలో ఉన్న వారే ఉంటున్నారనీ, వారు ఇళ్లకు వెళ్లి వచ్చిన తర్వాతే లక్షణాలు బయటపడుతున్నాయని చెబుతున్నారు. కాగా పిల్లలు వైరస్‌ బారిన పడిన సమయంలో వారి ఆరోగ్యపరంగా వచ్చే మార్పుల్లో తేడాలను గమనించ గలిగితే ఇబ్బందులు తక్కువేనంటున్నారు.

పిల్లల్లో వైరస్‌ సోకినప్పుడు జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, ముక్కుదిబ్బడ, దగ్గు, గొంతునొప్పి, శ్వాస వేగంగా తీసుకోవడం, వికారం, వాంతి, విరోచనాలు, కడుపు నొప్పి, ఆహారం సరిగా తినకపోవడం, ఆకలి లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని గతంలోనే కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాదు కొందరు పిల్లల్లో కొవిడ్‌ మల్టీసిస్టమ్‌ ఇన్‌ప్లమెటరీ సిండ్రోమ్‌ సమస్యకు దారితీస్తోందనీ, ఎప్పుడూ మగతగా ఉన్నా.. తికమక పడుతున్నా, చర్మం, పెదవులు, గోళ్లు పాలిపోతున్నా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. కొవిడ్‌ సోకిన పిల్లల పట్ల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి తాజాపండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆహారం తినిపించాలి. జ్వరం, జలుబు లాంటి స్వల్ప లక్షణాలు ఉండి ఇతర ఆరోగ్య సమస్యలేవిూ లేకపోతే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *