ముఖ్యమంత్రి యోగీకి మఠాధిపత్యమే మిగలనున్నదా?

 ముఖ్యమంత్రి యోగీకి మఠాధిపత్యమే మిగలనున్నదా?

భూమిపుత్ర ,లక్నో:

మోదీ ప్రభుత్వంపై దేశ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. దేశంలో కరోనా నియంత్రణను కట్టడి చేయలేకపోయారన్న ఆగ్రహం ప్రజల్లో ఎక్కువగా కనపడుతుంది. ఈ ప్రభావం ఎన్నికలపైన కూడా పడుతుంది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ ప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రాంతీయ పార్టీలు ఉత్తర ప్రదేశ్‌ లో పుంజుకోవడం విశేషం.ఉత్తర్‌ ప్రదేశ్‌ లో ఏప్రిల్‌ నెలలో పంచాయతీ ఎన్నికలుజరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెజారిటీ పంచాయతీలు సమాజ్‌ వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు కైవసం చేసుకున్నాయి. ఇటు యోగి ఆదిత్యానాధ్‌ ప్రభుత్వం, అటు మోదీ సర్కార్‌ పై ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల్లో స్పష్టంగా కన్పించింది. దీంతో బీజేపీకి రానున్నది కష్టకాలమేనని భావించవచ్చు.

మరికొద్ది నెలల్లోనే ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన బీజేపీ ఈసారి కనీస స్థానాలను దక్కించుకోవడం కష్టమేనంటున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. సమాజ్‌ వాదీ పార్టీ అయోధ్య, వారణాసి ప్రాంతాల్లో మెజారిటీ పంచాయతీలు దక్కించుకుంది. అలాగే మధురలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ, ఆర్‌ఎల్డీలు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్నాయి.ఉత్తర్‌ ప్రదేశ్‌ లో మొత్తం 3,050 స్థానాలకు ఎన్నికలు జరగ్గా బీజేపీ కేవలం 700 సీట్లను మాత్రమే సొంతం చేసుకుంది. విపక్షాలు 2,400 స్థానాలను సాధించి అధికార పార్టీ పై పట్టు సాధించాయి. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో నలభై స్థానాల్లో కేవం ఎనిమిది స్థానాలను మాత్రమే బీజేపీ దక్కించుకోవడం విశేషం. అలాగే యోగి ఆదిత్యానాధ్‌ సొంత ప్రాంతమైన గొరఖ్‌ పూర్‌ లోనూ విపక్షాలు విజయం సాధించాయి. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండే అవకాశముంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *