కరోనా బాధితులపై ఎందుకింత కాఠిన్యం?

 కరోనా బాధితులపై ఎందుకింత కాఠిన్యం?

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్ట పరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని అఫిడవిట్‌ ద్వారా తెలిపింది. అలా నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. ఇంతకాలం ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకుంటుందన్న ఆశ దీంతో చల్లారింది. కరోనాతో ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి కేంద్రం ఆదుకునేలా ముందుకు రావాల్సిన తరుణంలో ఇలాంటి నిర్ణయం ప్రకటించడం దారుణం. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు విపత్తు సహాయం కింద కనీసం రూ.4 లక్షలు నష్ట పరిహారం చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది.

ఈ ఏడాది మే 24న సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసుపై స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కొనడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరంలో ఉన్నవారికి వివిధ పథకాల కింద భారీ మొత్తాన్ని చెల్లించినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కరోనా బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సి వస్తే ఎస్‌డిఆర్‌ఎఫ్‌ నిధులన్నీ వాటికే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అలా చేస్తే కరోనా వైరస్‌ విజృంభణ సమయంలో అత్యవసర వైద్య సేవలు, పరికరాలను సమకూర్చుకోవడం, తుపానులు, వరదలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు రాష్టాల్ర వద్ద సరిపడా నిధులు ఉండవు’ అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందుకే కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని పిటిషనర్‌ చేసిన విన్నపం రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థోమతకు మించినదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

కేవలం వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరిత్యాలకు మాత్రమే విపత్తు సహాయం వర్తిస్తుందని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.అయితే పిటిషనర్‌ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన వివరాల ప్రకారం దేశంలో కరోనా వ్యాప్తి జరుగుతున్న తీరు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్ర విపత్తుల స్పందన నిధి క్రింద సహాయాన్ని అందజేసేందుకు, ఈ వ్యాధిని నోటిఫైడ్‌ డిజాస్టర్‌గా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విపత్తు స్పందన నిధి, జాతీయ విపత్తు స్పందన నిధిల నుంచి సహాయం అందజేయడానికి కొన్ని సవరణలను జారీ చేసింది. మరణించిన వ్యక్తులకు రూ.4 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసింది.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ లేఖను పంపించింది. పరిహారం ఇవ్వడానికి అరుదైన వనరులను ఉపయోగించడం, ఆరోగ్యంపై చేసే వ్యయాన్ని ప్రభావితం చేసి, మంచి కంటే ఎక్కువ నష్టం కలిగిస్తుందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది. చాలా వరకు ప్రతి బాధితుడి మరణ ధ్రువీకరణ పత్రాల్లో ‘కోవిడ్‌ డెత్‌‘ అని జారీ చేసినట్లు కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది. మరణ ధ్రువీకరణ పత్రాల్లో కోవిడ్‌ డెత్‌ అని రాయకుండా విస్మరించే వైద్యులు, ఈ పత్రాల జారీకి సబంధించిన ఇతర అధికారులు విచారణార్హులౌతారని కేంద్రం పేర్కొంది. కోవిడ్‌ మహమ్మారి బారిన పడి మరణించినవారి మరణ ధ్రువీకరణ పత్రాల్లో కచ్చితంగా ’కోవిడ్‌ డెత్‌’గా పేర్కొనాలని స్పష్టం చేసింది. అయితే వీరిని ఏ రకంగా ఆదుకుంటారో చెబితే బాగుండేది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *