రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

 రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

భూమిపుత్ర,అమరావతి:

అడ్డంకులను అధిగమించకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.అందుకు విజయసాయి రెడ్డి,బొత్స వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. మూడు రాజధానులను ప్రకటించిననాటి నుండీ అనేక వివాదాలు ఈ అంశం చుట్టూ ముసురుకున్నాయి. అధికార వికేంద్రీకరణ అని బయటకు చెపుతున్నా ముఖ్యమంత్రి జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని విశ్లేషకుల వాదన. శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపారా లేదా అని సామాన్యజనానికి అనుమానాలున్నప్పటికీ లోలోపల మాత్రం రాజధాని తరలింపు పనులు ఆగలేదని అంటారు.ప్రజలు కూడా ఇందుకు అనుగుణంగా విడిపోయారు. రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలని, నీరూ భూమీ పుష్కలంగా అందుబాటులో ఉండాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌ వెల్లడించారు.

ఇప్పుడు అందుకు భిన్నంగా గత రెండేళ్లుగా ఆయన తన కార్యాచరణను కొనసాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణ అన్న కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. జగన్‌ తీసుకున్న నిర్ణయం అద్భుతం, అమోఘం అని మంత్రులు అభినందిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు తమ ఎజెండా ప్రకారం చేస్తున్న ప్రకటనలు ప్రజలను మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలో శాశ్వతంగా ఉండదన్న విషయాన్ని గమనించడం లేదు. కనీసం ఉద్యోగుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. అలాగే కోర్టులో ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని తమ సొంత ఎజెండాను అమలు చేస్తున్నారు.

దేశ ఆర్థిక వ్యవస్థను కొవిడ్‌ చిన్నాభిన్నం చేయడమే కాకుండా ప్రజల జీవితాలను ఆగం చేస్తోంది. అయినా ఆ విషయం గురించి పెద్దగా ఆలోచించని ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి విషయంలో పెద్దగా పట్టింపు లేకుండా ఉన్నారు. ఇదే సమయంలో మూడు రాజధానుల పేరిట ముఖ్యమంత్రి జగన్‌ బిజీగా ఉన్నారు. విశాఖకు రాజధాని తరలిపోవడం ఖాయమని ఇటీవలే మంత్రి బొత్స మరోమారు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో తమకు ఏదో ఒరిగిపడుతుందన్న ఆశతో కొందరున్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులది అరణ్య రోదనే అయిందని అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఆరోపణలు గుప్పిస్తోంది. కరోనా వైరస్‌ బారినపడినవారు వైద్యం కోసం చేస్తున్న ఆక్రందనలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అమరావతి కోసం ప్రయాస పడుతోంది.

కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీలు కూడా పోరాడుతున్నా లాభం లేకుండా పోయింది. రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్రాల పరిధిలోనిదని, కేంద్రానికి ఏ పాత్రా ఉండదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించడంతో జగన్‌ తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కోర్టులో తీర్పు ఎలా రానున్నా కార్యనిర్వాహక రాజధాని విశాఖకు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రులు, ఎంపిలు ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగులు ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ముఖ్యం. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఇటీవల కరోనాతో పలువురు మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలో వారు రాజధాని తరలింపు అంటేనూ భయపడుతున్నారు. గట్టిగా ప్రశ్నిస్తే ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తుందేమోనన్న భయంతో ఊపిరి బిగబట్టి ఉన్నారు.

డీఏలు, పీఆర్‌సీ, కరోనా కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులు, కొవిడ్‌తో మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగ భద్రతతోపాటు కారుణ్య నియామకాలు కల్పించాలని వారు కోరకుంటున్నారు. రాజధాని అమరావతిగా ఉంటుందని పలువురు ఉద్యోగులు ప్లాట్లు కొనుగోలు చేసి ఆర్థికంగా చితికిపోయారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో వీరందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధానులు మారిస్తే తమ పరిస్థితి, తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కరోనా దెబ్బకు పలు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని, 11వ పీఆర్‌సీ, డీఏ సకాలంలో రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, వాపోతున్నారు. సచివాలయంలో కరోనా సెకండ్‌ వేవ్‌లో 13మంది ఉద్యోగులను కోల్పోయామని, వారి కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, కంపాసినేట్‌ అపాయింట్‌మెంట్‌ త్వరితగతిన ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఉద్యోగుల పిల్లలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నారు. కొవిడ్‌ వల్ల మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలంటున్నారు. ఉద్యోగుల పదోన్నతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *