పంట పండుతోన్న పాత కార్ల వ్యాపారం

 పంట పండుతోన్న పాత కార్ల వ్యాపారం

భూమిపుత్ర, బిజినెస్:

కరోనా తగ్గుముఖం పట్టాక పాతకార్ల బిజినెస్‌ తప్పక పుంజుకుంటుందని ఆటోమొబైల్ కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి. వైరస్‌ సోకుతుందనే భయంతో చాలా మంది బస్సుల్లో ప్రయాణాలకు జంకుతున్నారు. సొంత కార్లలోనే వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. కొత్తవి కొనడం సాధ్యం కాని వాళ్లు సెకండ్‌హ్యాండ్‌ కార్లవైపు చూస్తున్నారని డీలర్లు అంటున్నారు. మారుతి, మహీంద్రా, టొయోటా పాత కార్ల వ్యాపారంపై సానుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం అమ్మకాలు లేకపోయినప్పటికీ, దీర్ఘకాలంలో సేల్స్‌ పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అంచనాలు చెప్పడం మాత్రం కష్టమని అంటున్నాయి. ‘‘సెకండ్‌వేవ్‌ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో పాత కార్ల వ్యాపారం ఎలా ఉంటుందో ఊహించడం చాలా కష్టం. పాతకార్లకు డిమాండ్‌ ఉన్నప్పటికీ, డిమాండ్‌కు తగినంత సరఫరా రాకపోవచ్చు’’ అని మారుతి సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు.

మారుతికి దేశవ్యాప్తంగా 570 ట్రూ వాల్యూ అవుట్‌లెట్లు ఉన్నాయి. ఎక్సేంజ్‌ సహా ఇతర మార్గాల నుంచి తీసుకున్న పాతకార్లను వీటిలో అమ్ముతారు.కరోనా సెకండ్‌వేవ్‌ వల్ల దేశవ్యాప్తంగా 416 అవుట్‌లెట్లను మూసివేశామని, దీంతో బిజినెస్‌ బాగా తగ్గిందని శ్రీవాస్తవ వివరించారు. ఎక్కువ మంది పర్సనల్‌ వెహికల్స్‌ను ఇష్టపడటం వల్ల పాత కార్లకు డిమాండ్‌ బలంగా ఉందని, సప్లై తగినంత లేదని అన్నారు. మారుతి పాతకార్ల అమ్మకాలు అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో 36 శాతం తగ్గి 4.18 లక్షల యూనిట్ల నుంచి 2.65 లక్షల యూనిట్లకు పడిపోయాయి. ఇది 2018;19లో 4.22 లక్షల యూనిట్లను, 2017-18లో 3.54 లక్షల యూనిట్లను, 2016-17లో 3.46 లక్షల యూనిట్లను అమ్మింది. ‘‘కరోనా ఇలాగే ఉంటే, ఈ సంవత్సరం కూడా అమ్మకాలు తక్కువగా ఉంటాయి. కార్ల ఎక్సేంజీలు తగ్గుతాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ , మే నెలల్లో గిరాకీ విపరీతంగా పడిపోయింది. అయితే అమ్మకానికి వచ్చే కార్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది. కరోనా తగ్గి లాక్డౌన్లు ఎత్తేస్తే, కచ్చితంగా పుంజుకుంటాం. గత ఏడాది కరోనా తగ్గాక పాత కార్లతోపాటు కొత్త కార్ల అమ్మకాలూ పెరిగాయి’’ అని శ్రీవాస్తవ వివరించారు.

మారుతి, టొయోటా మాదిరే మహీంద్రా తన పాత కార్ల వ్యాపారంపై సానుకూల ఆలోచనలతో ఉంది. కరోనా తగ్గితే తప్పక అమ్మకాలు పెరుగుతాయని ధీమాగా ఉంది. ‘‘మేం కొత్త టెక్నాలజీల్లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తున్నాం. పాతకార్లను అమ్మే మా ఎంఎఫ్‌సీ అవుట్‌లెట్లను పెంచుతున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలను 100 శాతం పెంచాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నాం’’ అని మహీంద్రా ఫస్ట్‌ చాయిస్‌ వీల్స్‌ ఎండీ , సీఈఓ అశుతోష్‌ పాండే చెప్పారు. 2019, 2020లో బిజినెస్‌ 60 శాతం పెరిగిందని అన్నారు. కరోనా వల్ల గత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో నష్టాలు వచ్చినా, తదనంతరం ఎంఎఫ్‌సీ వ్యాపారం 20 శాతానికి పైగా పెరిగింది. నాలుగు క్వార్టర్లలో1.8 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. సెకండ్‌ హ్యాండ్‌ వెహికల్స్‌ బిజినెస్‌ పెరుగుతుందని నోమురా తెలిపింది. సేల్స్‌ ఏటా 15 శాతం పెరుగుతున్నాయని, 2024 నాటికి ఈ అమ్మకాలు 49 బిలియన్‌ డాలర్లకు చేరుతాయని పేర్కొంది. ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్‌ హ్యాచ్‌బాక్స్‌ను ఇష్టపడుతున్నారని తెలిపింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *