మఠాధిపతి నియామకంలో సందిగ్థత !!

 మఠాధిపతి నియామకంలో సందిగ్థత !!

బ్రహ్మంగారి మఠం

బ్రహంగారి భక్తుల విశ్వాసాలకు విఘాతం

బ్రహ్మంగారిమఠం పదకొండవ మఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి పరమపదించడంతో ఆయన స్థానాన్ని పూరించే నూతన మఠాధిపతి ఎవరన్న విషయంలో సందిగ్థ పరిస్థితులు నెలకొన్నాయి. కొత్త మఠాధిపతి స్థానం కోసం పదకొండవ మఠాధిపతి ఇరువురు భార్యల సంతానం మధ్య పోటీ ఏర్పడటమే ఈ సందిగ్థతకు కారణమైంది. నూత్న మఠాధిపతిగా నియమితులు కావడానికి ఎవరికీ అర్హత ఉంది ? ఎవరికీ లేదు అని తేల్చడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం కాదు. అది పూర్తిగా చట్టపరమైన నిర్ణయం. చట్టాన్ని గౌరవించడం పౌరుల విధి. కాక పొతే దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న బ్రహ్మంగారిమఠంలో మఠాధిపతి నియామకం సంక్లిష్టంగా మారడం అనేది జేజినాయనగా పిలువబడే వీరభ్రహ్మంగారి భక్తులకు, జిజ్ఞాశువులకు ఆందోళన కలిగించే విషయం.

బ్రహ్మంగారిమఠం జగద్విఖ్యాతి గాంచిన మఠం. కడప జిల్లా కందిమల్లాయపల్లెలో శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి స్థాపించిన మఠం. అయన బోధించిన కాలజ్ఞానం భవిష్యత్ పరిణామాలను వివరించడమే కాకుండా అనేక తార్కాణాలు నిరూపితమయ్యాయి. లోకంలో వేమన వంటి యోగి , బ్రహ్మంవంటి గురువు, సిద్దయ్య వంటి శిష్యుడు లేదని నానుడి. మఠం వంశ పారంపర్య చరిత్రను ఒకసారి పరిశీలిస్తే మఠాధిపతి నియామకం, మార్పు విషయంలో ఇలాంటి గందరగోళ పరిస్థితులు, ఉద్రిక్తతలు ఎప్పుడూ చోటుచేసుకున్న దాఖలాలు లేవు.

వీరబ్రహం, గోవిందమాంబ దంపతులకు సిద్ధలింగయ్య , గోవిందయ్య, శివరామయ్య, పోతులూరయ్య, ఒంకారయ్య అనే ఐదుగురు కుమారులు, వీరనారాయణమ్మ అనే కుమార్తె సంతానం. తన పెద్దకుమారుడైన సిద్ధలింగయ్యను బ్రహ్మంగారు చిన్నకొమెర్లలోని మాతామహుల ఇంటికి దత్తత పంపారు. బ్రహ్మంగారికి సంతానం ఉన్నప్పటికీ, వారంతా వ్యతిరేకించినప్పటికీ తనను అంటిపెట్టుకుని ఉండిన ప్రియశిష్యుడికి బ్రహ్మంగారు బ్రహ్మోపదేశం, తారకయోగం, పంచముద్రలు, సాంఖ్యమూ, షట్చక్ర నిరూపణము, భాగవత ధర్మాలు బోధించారు. జీవసమాధి అవుతున్న గురువు గారి కోసం పూలకు వెళ్ళిన సిద్దయ్య సమయానికి రాకముందే బ్రహ్మంగారు జీవసమాధి అయ్యారు. సిద్దయ్య విలపిస్తాడు. బ్రహ్మంగారు మళ్ళీ సమాధినుంచి బయటికి వచ్చి తన మార్గం అనుసరించమని అచల పరిపూర్ణ సిద్ధాంతాన్ని బోధించి సిద్ధయ్యకు యోగదండం, పాదుకలు, బెత్తం, శిఖాఉంగరాన్ని అప్పగించారు.

బ్రహ్మంగారి తర్వాత దూదేకుల సిద్దయ్య మఠాధిపతి అవుతారని, అవ్వాలని అప్పట్లో కొంతమందైనా ఆశించి వుంటారు. కానీ మఠాధిపత్యం సిద్ధయ్యకు దక్కలేదు. అప్పుడు కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న చరిత్ర లేదు. బ్రహ్మంగారి నిర్ణయం మేరకే రెండవకుమారుడు గోవిందయ్యకు మఠాధిపత్యం దక్కింది. గోవిందయ్య పెద్దకుమార్తె ఈశ్వరమ్మ ను పరమేశ్వరీ అవతారంగా పేరు గడించింది. గోవిందయ్య తర్వాత బ్రహ్మంగారి నాలుగవ కుమారుడు పోతులూరయ్య మఠాధిపతి అయ్యారు. ఆ తర్వాత బ్రహ్మంగారి వంశం, నిర్వంశం కావడంతో కర్నూలుజిల్లా నొస్సం లోని బ్రహ్మంగారి కుమార్తె వీరనారాయణమ్మ కుమారుడు పెదగోవిందయ్యకు మఠాధిపత్యం లభించింది*( పెదగోవిందయ్య వీరనారాయణమ్మ మనవడిగా కొందరు చరిత్రకారులు తమ రచనల్లో పేర్కొన్నారు.). తర్వాత అయన సంతాన వారసులు సదానంద గోవిందస్వామి, వెంకటాద్రిస్వామి, పెద్దవీరయ్య స్వామి, చిన్నవీరయ్య స్వామి, గోవిందస్వామి, వేంకటేశ్వర స్వామి, శ్రీనివాసస్వామి మఠాధిపతులుగా వ్యవహరించారు.

ఇటీవల పరమపదించిన వీరభోగ వసంత వేంకటేశ్వర స్వామి 11 వ మఠాధిపతిగా 1969 ఆగస్టు 10వ తేదీన మఠాధిపత్యం స్వీకరించారు. 2021 మేనెల 8 తేదీన పరమపదించే వరకు దాదాపు 51 సంవత్సరాల పాటు మఠాధిపతి ఆయన కొనసాగారు. మఠాధిపతి పరమపదించక ముందే తన తర్వాత తన రెండవభార్య పెద్ద కుమారుడైన గోవిందస్వామి మఠాధిపతి గా నియమిస్తూ వీలునామా రాసినట్లుగా అయన రెండవ సతీమణి మారుతి లక్ష్మీదేవమ్మ ఒక పత్రాన్ని పత్రికలవారికి వెల్లడిస్తున్నారు. అయితే మేజర్ కాని వ్యక్తిని మఠాధిపతిగా పూర్వ మఠాధిపతి నియమిస్తే ఆ వ్యక్తి మేజర్ అయ్యేంతవరకు గార్డియన్ గా మరొకరు వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే దివంగత మఠాధిపతి పెద్దభార్య కుమారులమైన తమకే మఠాధిపత్యం దక్కాలని దివంగత మఠాధిపతి పెద్ద సతీమణి కుమారులు వెంకటాద్రిస్వామి, గోవిందస్వామి, దత్తాత్రేయస్వామి, వీరంభోట్లయ్య స్వామి కోరుతున్నారు. దివంగత మఠాధిపతి వేంకటేశ్వరస్వామి కూడా పెద్ద కుమారుడిగా మఠాధిపత్యం పొందడం ఇక్కడ గమనార్హం.

అయితే గత మఠాధిపతి నిర్ణయం మేరకు తనకు తోచిన వారికీ మఠాధిపత్యం కట్టబెట్టే అధికారం కలిగి ఉంటారని ఎండోమెంట్ చట్టం చెబుతోందని మరికొందరి వాదనగా వినిపిస్తోంది. అయితే తన తదుపరి మఠాధిపతిని నిర్ణయించిన 90 రోజుల్లోగా పూర్వమఠాధిపతి దేవాదాయశాఖ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేసి ఉండాల్సి ఉంటుందని తెలుస్తోంది. అలాజరిగిందో లేదో అనే విషయం ఎండోమెంట్ అధికారులు తేల్చాల్సిన విషయం. ఈ వివాదం మూడు వారాలుగా కొనసాగడం వల్ల భక్తుల విశ్వాసాలకు విఘాతం కలగడమే కాకుండా మఠం ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. బ్రహ్మంగారి తాత్వికతను అధ్యయనం చేసిన చరిత్రకారుడిగా, రచయితగా బ్రహ్మంగారిని ఆరాధించే భక్తుడిగా నేనుకూడా ఈ విషయంలో ఆందోళనకు గురవుతున్నాను. అధికారులు, విద్వత్జనులు సమాలోచనలు జరిపి తక్షణమే అర్హులైన వారిని నిర్ణయించి మఠంలో నెలకొన్న సందిగ్థ పరిస్థితికి తెరదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తవ్వా ఓబుళరెడ్డి.,
జర్నలిస్టు,ప్రముఖ కథా రచయిత,ఉపాధ్యాయులు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *