ఉత్తరప్రదేశ్ విభజన బీజేపీని గెలిపిస్తుందా!!

 ఉత్తరప్రదేశ్ విభజన బీజేపీని గెలిపిస్తుందా!!

భూమిపుత్ర,సంపాదకీయం:

భారతీయ జనతాపార్టీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది ఉత్తరప్రదేశ్‌. 2022 ప్రథమార్థంలో జరిగే శాసనసభ ఎన్నికలపైనే 2024 లోక్‌ సభ ఎన్నికలూ ఆధారపడి ఉంటాయని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ సుస్థిరపాలనకు ఉత్తరప్రదేశ్‌ ఊతమిస్తోంది. ఈ రాష్ట్రంలో లభించిన మెజార్టీనే దేశంలో బీజేపీని తిరుగులేని శక్తి గా మార్చింది. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. ఒకవేళ ఉత్తరప్రదేశ్‌ లో ఓటమి పాలైతే ఆ తర్వాత రెండేళ్లు కేంద్రంలో కూడా పరిపాలన సజావుగా సాగదు. అస్థిరత ఏర్పడుతుంది. ప్రతిపక్షాలు పుంజుకుంటాయి. ఆ భయమే ఇప్పుడు బీజేపీని వణికిస్తోంది. ఇటీవలి ఎన్నికలన్నిటిలోనూ విపక్షాలు పైచేయి సాధించాయి. అందుకే ప్రత్యామ్నాయ ప్రణాళికతో తన ఆధిక్యాన్ని కాపాడుకోవడంపై అధినాయకత్వం దృష్టి సారించింది.

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన యూపీని నాలుగు రాష్ట్రాలుగా చేయాలని ఎప్పుడో బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్‌ చేశారు. ఆ ప్రతిపాదన దుమ్ము దులిపి విధంగా బీజేపీ పావులు కదుపుతోందనేది రాజకీయ వర్గాల సమాచారం. అదే జరిగితే దేశ చిత్రపటంలో మరికొన్ని రాష్ట్రాలు చేరతాయి.విభజనే అనివార్యమైతే పశ్చిమ ప్రదేశ్,అవధ్ ప్రదేశ్,బుందేల్ ఖండ్,పూర్వాంచల్ లుగా విడగొట్టాలని ప్రతిపాదన. రామాలయ నిర్మాణం, జమ్ము కాశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణలు వంటి అంశాలన్నీ ప్రజల దృష్టిలో పాతబడి పోయాయి. కొత్తగా బీజేపీకి ఓట్లు తెచ్చి పెట్టే అజెండా కరవు అయ్యింది. ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి మూకుమ్మడిగా తమ వైపు మలచుకునేందుకు కొత్త అంశం ఒక్కటి కూడా కనిపించడం లేదు. ఫలితంగానే తాజాగా ఉత్తరప్రదేశ్‌ లో జరిగిన పంచాయతీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం చవి చూసింది. రాష్ట్ర రాజధాని లక్నో, ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గోరఖ్‌ పూర్‌ వంటి ప్రాంతాలన్నిటా చేదు ఫలితాలే ఎదురయ్యాయి.

కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీ ఇలా చతికిలపడటం అనూహ్యమైన పరిణామం. అంతే కాదు, రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తుకు సంకేతం. పైపెచ్చు అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించిన రామజన్మభూమి తీర్థ ట్రస్టు ఇటీవల కొన్ని ఆరోపణలనూ ఎదుర్కొంటోంది. భూముల కొనుగోలులో అవినీతి జరిగిందని సమాజ్‌ వాదీ పార్టీ ఆరోపిస్తోంది. ఇది తమ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తుందేమోనన్న భయం మరోవైపు వెంటాడుతోంది.ఉత్తరప్రదేశ్‌ ను వివిధ మతాలు, కులాల సంకుల సమరంగానే చూడాలి. ఇక్కడ పార్టీలు కూడా ఎక్కువే. బీజేపీ, సమాజ్‌ వాదీ, బహుజనసమాజ్‌, కాంగ్రెసు పెద్ద పార్టీలుగా చెప్పుకోవాలి. ఆర్‌ ఎల్‌ డీ, అప్నాదళ్‌ వంటి ఉపప్రాంతీయ పార్టీలకూ కొదవ లేదు. ఎక్కువ పార్టీలు పోటీలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి బీజేపీకి కలిసి వస్తుందని నిన్నామొన్నటి వరకూ నాయకత్వం ఆశలు పెట్టుకుంది.

తాజా గా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, పరిణామాలు ఆ ఆశలను నీరు గారుస్తున్నాయి. బహుజన సమాజ్‌ పార్టీ అంతర్గత విభేదాలతో పూర్తిగా బలహీనపడిపోయింది. కాంగ్రెసు పార్టీ చేతివేళ్లపై లెక్కించదగిన సీట్లలోనూ పోటీ చేయగల సామర్థ్యం ఉంది.సమాజ్‌ వాదీ పార్టీ దూకుడు బాగా పెరిగింది. బీజేపీతో ముఖాముఖి పోటీ పడితే పైచేయి సాధించే సామర్థ్యం ఎస్పీకి ఉంది. గతంలోనే ముఖ్యమంత్రిగా పనిచేసిన అఖిలేష్‌ నాయకత్వమూ ఆ పార్టీకి అదనపు బలం. దార్శనికునిగా మద్యతరగతి వర్గాల్లో అఖిలేష్‌ కు మంచి పేరుంది. ప్రతిపక్షాల ఓట్ల చీలిక గణనీయంగా లేకపోతే బీజేపీ ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు.ఉత్తర ప్రదేశ్‌ చిన్నాచితక రాష్ట్రం కాదు. దేశంలో ఎన్ని భిన్న రకాల సంస్కృతులు , సంప్రదాయాలు ఉన్నాయో అంతకుమించిన వైవిధ్యం యూపీలో కనిపిస్తుంది. ప్రపంచంలోని అనేక దేశాల కంటే పెద్ద రాష్ట్రం ఇది. కేవలం చైనా, అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్‌ మాత్రమే బారత్‌ లోని యూపీ కంటే పెద్ద దేశాలు.

మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కంటే నాలుగు రెట్లు పెద్దది. తెలంగాణ కంటే ఆరు రెట్లు పెద్ద రాష్ట్రం. దీనిని మూడు నాలుగు రాష్ట్రాలుగా విభజిస్తే సమాజ్‌ వాదీ, బీఎస్పీ వంటి పార్టీల ప్రాబల్యాన్ని కొంత ప్రాంతానికే పరిమితం చేయవచ్చనేది ఒక ఆలోచన. రాష్ట్రాల విభజన తర్వాత ప్రాంతీయ పార్టీలు అధినేతల సొంత ప్రాంతానికే కాలక్రమంలో పరిమితమవుతాయి. తెలుగుదేశం, వైసీపీలు ఆంధ్రప్రదేశ్‌ కు కుదించుకుపోయిన ఉదాహరణే ఇందుకు నిదర్శనం. కానీ జాతీయ పార్టీలకు ఈ సమస్య ఉండదు. ఎలాగూ కాంగ్రెసు పార్టీ యూపీలో అన్ని ప్రాంతాల్లోనూ దెబ్బతింది. అందువల్ల బీజేపీకి ఆ పార్టీ పెద్ద పోటీనిచ్చే పరిస్థితి లేదు. సమాజ్‌ వాదీని కూడా ఒక ప్రాంతానికి పరిమితం చేస్తే శాశ్వతంగా దేశ చిత్రపటంలో బీజేపీ ఆధిక్యాన్ని స్థిరపరచుకోవచ్చనేది దీర్ఘకాలిక ప్రణాళికగా చెబుతున్నారు. వచ్చే ఆరేడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా బయటపడాలనేది తక్షణ సమస్య. ఈ లోపుగా రాష్ట్ర విభజన వంటి సంక్లిష్ట సమస్య సాకారమవుతుందా? అంటే సందేహమే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *