నీటిశోభతో సోయగాలొలికిస్తున్న చెరువులు

 నీటిశోభతో సోయగాలొలికిస్తున్న చెరువులు

భూమిపుత్ర,అనంతపురము:

అనంతపురం జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, ప్రాజెక్టులు నిండి నీటి శోభతో సోయగాలొలికిస్తున్నాయి. కొన్ని దశాబ్ధాల తరువాత మిడ్‌ పెన్నార్‌ ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండటంతో జలకళ సంతరించుకుంది. పెన్నా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పటికీ హెచ్‌ఎల్సి మొదటి దశ కింద గార్లదిన్నె మండలంలోని పెనకచెర్ల వద్ద 1963లో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఒక్కసారి మాత్రమే డ్యామ్‌ పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండి పొంగిపొర్లింది. ఆ తరువాత నుంచి ఒక్కసారి కూడా పూర్తి స్థాయి సామర్థ్యంతో నీళ్లు నిండిన దాఖలాల్లేవు. 39 ఏళ్ల తరువాత తొలిసారిగా ఈ సంవత్సరం డ్యామ్‌ నిండింది.ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నిలువ సామర్థ్యం 5.20 టిఎంసిలు. ఈ నిర్మాణం పూర్తయిన తరువాత 1981లో పెన్నానదికి వరద పోటెత్తిరావడంతో తొలిసారిగా 1.25 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు నదిలో వదిలారు.

1981 తరువాత అంటే 39 ఏళ్ల తరువాత మరోమారు 2020 లో పూర్తి స్థాయి సామర్థ్యం అంటే 5.20 టిఎంసిల నీరు డ్యామ్‌ కు చేరింది. తిరిగి ఈ సంవత్సరం కూడా నిండి పరవళ్లు తొక్కుతోంది.వర్షాలు అధికమై నీరు మరింత వచ్చే అవకాశాలు పెరిగితే దిగువకు మరిన్ని గేట్లు ఎత్తి వదిలేందుకు వీలుగానూ అధికారులు అప్రమత్తమై ఉన్నారు.చాలా కాలం తరువాత డ్యామ్‌ పూర్తి స్థాయి సామర్థ్యంతో నిండి ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒకవైపు తుఫాను ప్రభావంతో వర్షాలు పడే సూచనలు కూడా ఉండటంతో డ్యామ్‌ ఎగువ భాగంలో వర్షాలు అధికంగా పడితే దిగువకు నీటిని వదిలేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే మిడ్‌ పెన్నార్‌ ఉత్తర, దక్షిణ కాలువలతోపాటు, స్లూయిస్‌ లోకి 3 గేట్ల ద్వారా నీటిని వదిలారు.ఈ ప్రాజెక్టు కిందనున్న కాలువల కింద 71 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించి ఉంది. మిడ్‌ పెన్నార్‌ కు హెచ్‌ఎల్సి నుంచి వచ్చే ఇన్ప్లోస్‌ ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎగువనున్న పిఎబిఆర్ కు వదిలారు. పిఎబిఆర్‌ లోనూ పూర్తి సామర్థ్యం నీరు వచ్చి చేరింది. చాలాకాలం తరువాత ఎంపిఆర్‌ నిండుకుండలా మారింది. మూడు గేట్లు ఎత్తడంతో మారడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

Related News

Leave a Reply

Your email address will not be published.