ఆందోళన అవసరం లేదు

 ఆందోళన అవసరం లేదు

అందరికీ వ్యాక్సినేషన్ అత్యవసరం

భూమిపుత్ర,అమరావతి:

ఒమిక్రాన్‌ తీవ్రమైన వైరస్‌ కాదని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఎ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు చెప్పారు. ఇప్పటి వరకు 60 శాతం మందే రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా వ్యాక్సిన్‌ వేసేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతానికి బూస్టర్‌ డోస్‌ అవసరంలేదని ఆయన అభిప్రాయపడ్డారు.డెల్టాతో పోల్చితే నాలుగు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ, ప్రమాదకరం కాదని తెలిపారు. ఒమిక్రాన్‌ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై దృష్టి సారించడంతోపాటు మాస్క్‌ ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.ఒమిక్రాన్‌తో మైల్డ్‌ సింప్టమ్స్‌ మాత్రమే వస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోందన్నారు. కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సినేషన్‌ రెండు డోసులను వేయించుకోవాలని సూచించారు.

కోవిడ్‌ ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో విధి నిర్వహణలో ఉన్న 85 మంది వైద్యులు మరణించినట్లు చెప్పారు. వారి కుటుంబాలకు కేందప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందలేదన్నారు. కోవిడ్‌ సమయంలో డాక్టర్లు ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించారని అన్నారు. మరణించిన 85 మంది డాక్టర్ల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. ఆసుపత్రుల్లో ఫైర్‌ సేప్టీ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని తెలిపారు. లైసెన్స్‌డ్‌ ఎలక్టీష్రియన్‌తో తనిఖీ చేయించి ధ్రువీకరణపత్రం ఇస్తామని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని ప్రభుత్వానికి తెలిపినట్లు పేర్కొన్నారు. చిన్న ఆసుపత్రులను దృష్టిలో పెట్టుకుని భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని కోరారు.

Related News

Leave a Reply

Your email address will not be published.