పదవుల పటాటోపమే కానీ ప్రయోజనం శూన్యం

 పదవుల పటాటోపమే కానీ ప్రయోజనం శూన్యం

భూమిపుత్ర,అమరావతి:

రాజకీయాల్లో నాయకులు ప్రధానంగా ఈ కిరీటాలనే కోరుకోవడం సహజం. చేతిలో పదవి ఉంటే పట్టుకుని ఊరేగవచ్చు. ఇది నేటి రాజకీయాల్లో వెలుగొందుతున్న వాస్తవం. ఇలాంటి రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే ఎరిక్‌ ఫ్రామ్‌ అనే సామాజిక శాస్త్రవేత్త “అధికార వాంఛ బలం నుంచి కాక బలహీనత నుంచి ఉద్భవిస్తుంది…’’ అని వ్యాఖ్యానిస్తారు. రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడచిన రెండున్నరేళ్లలో పలు నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడంతో ఆ పార్టీలో దాదాపు చోటా, మోటా నేతలందరికీ పదవులు లభించినట్టే అయింది. తమ సామాజిక తరగతికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు అన్ని సామాజిక తరగతుల వారూ ప్రకటించారు. తాజాగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవుల పందేరం కూడా అయిపోయింది. ఎమ్మెల్సీల సంగతి సరేసరి.మిగతా పదవులతోనే రెండో తరగతి నాయకులు ఎలా పబ్బం గడుపుకోవాలో అర్థం కాని స్థితి వారిలో నెలకొంది.

రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది.  నేతలకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు లభించగా, పలువురికి డైరెక్టర్ల పదవులు వచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన వారిలో 80శాతం వైసిపి పార్టీకి చెందిన వారే. కానీ ఈ పదవులు అలంకార ప్రాయం మినహా జనానికి ఏవిూ ఒరగదన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి. పదవులు వచ్చిన వీరంతా ఏం చేయాలి? ఏం చేస్తున్నారు? ఏమైనా చేద్దామంటే వీరికి గల అధికారాలు? విధులు? ఏమైనా ప్రభుత్వం వైపు నుంచి నిర్దేశించబడ్డాయా? అంటే శూన్యం అనే చెప్పాలి.ఆర్భాటం తప్ప అసలు శూన్యం అని,పదవులు వచ్చినాయన్న సంతోషమే తప్ప వాహనాలకు ఈఎమ్ఐ లు కట్టుకోలేక ఫైనాన్స్ వాళ్ళు సదరు వాహనాలు ఎత్తుకెళితే ఏమీచేయలేకపోతున్నామని వాపోతున్నారు.

కార్పొరేషన్‌ డైరెక్టర్లు, చైర్మన్లును దిగువ శ్రేణి అధికార పార్టీ నాయకులు సన్మానించడం, లేదంటే వీరంతా వెళ్లి ఎంపీలనో, మంత్రులనో, ముఖ్యమంత్రినో కలవడం, దానికి మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం చేసుకోవడం మినహా ఫలానా కార్పొరేషన్‌ తరపున ఆ ప్రజలకు జరిగిన మేలు ఏదైనా ఉందంటే అది ఒట్టిమాటే.స్థానిక సంస్థలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల పరిస్థితి కూడా అలాగే ఉంది. జివిఎంసి పరిధిలోని వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వడం లేదు. దీనిపై ప్రతిపక్ష కార్పొరేటర్లు గతంలో ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా, అనంతపురం జిల్లాలోనూ సర్పంచ్‌లు చేస్తున్న ఆందోళన గురించి తెలిసిందే. పంచాయతీల అభివృద్ధికి చట్ట ప్రకారం కేంద్రం నుంచి విడుదలైన 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో అన్ని పంచాయతీల ఖాతాల్లోనూ జీరో బ్యాలెన్స్‌. సర్పంచ్‌లు ఏ చిన్న పని చేయలేని పరిస్థితిని వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చింది.

స్థానిక సంస్థల ప్రతినిధులు నగర పరిధిలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు వైసిపి ప్రభుత్వం వేసే భారాలకు వీరంతా ఆమోదముద్ర వేస్తున్నారు.మరోవైపు జగన్‌ ప్రభుత్వం వెనక నుంచి ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతుంది. చెత్త సేకరణకు రూ.125లు నెలనెలా వసూలు, ఆస్తి పన్ను పెంపు వల్ల జనం నెత్తిన భారాల మోత మోగుతుంది. ఇదీగాక తాజాగా ప్రభుత్వం డి పట్టా ఇల్లు, స్థలాలకూ రిజిస్ట్రేషన్‌ పేర రూ.20వేల నుంచి రూ.40వేలు వసూలు చేసి ఖజానా నింపుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే మద్యం, ఇసుక ధరలను రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ప్రభుత్వం పెంచడంతో సామాన్య, మధ్యతరగతి జనం విలవిల్లాడుతున్నారు. సంక్షేమం దారిలో ప్రయాణం చేస్తూ చేదు గుళికలనూ ప్రభుత్వం తినిపిస్తుందంటూ పలువురు ఆ పార్టీకి చెందిన నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published.