ప్రైవేటు పాఠశాలలపై చర్యలకెందుకు మీన మేషాలు?

 ప్రైవేటు పాఠశాలలపై చర్యలకెందుకు మీన మేషాలు?

భూమిపుత్ర,తెలంగాణ:

కరోనాతో ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల బతుకులు ఆగమయ్యాయి. ఉన్నత విద్యావంతులుగా ఉంటూ అనేక పాఠశాలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్లు గత ఏడాదిగా రోడ్డున పడ్డారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసి టీచర్లు, ఇతర సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వడంలేదు. మధ్యలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం తెరిచీ తెరవగానే బకాయిలు వసూలు చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఈ మధ్యలో అమాయకంగా నష్టపోయింది మాత్రం టీచర్లు, సిబ్బంది మాత్రమే. నిజానికి స్కూళ్లు నడిచాయంటే ప్రైవేట్‌ టీచర్ల వల్ల మాత్రమే. అయినా వారికి జీతాలు ఇవ్వక స్కూళ్లు మూతేసుకున్న యాజమాన్యాలు కాఠిన్యంగా వ్యవహరించాయి.ఇందుకు ఒకటీ అరా పాఠశాలలు మినహాయింపు. స్లేట్ లాంటి విద్యాసంస్థలు కరోనా సంక్షోభ సమయంలో కూడా ఎనిమిది నెలలు పూర్తి వేతనాలు అందించి ఇప్పుడు సగం వేతనం‌ ఇస్తున్నట్లు సమాచారం.ఇటువంటి వాటిని మనఃపూర్వకముగా అభినందించక తప్పదు. మరి కొన్ని సంస్థలకు చట్టం అన్నది లేకుండా పోయింది. ప్రత్యేక తెంగాణలో కూడా ప్రైవేట్‌ పాఠశాలలు అన్నీ దగా చేశాయి. ఈ స్కూళ్లలో భాగస్వాములుగా ఉన్న వారంతా అధికార పార్టీకి చెందిన వారే అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి. ఎపిలో కూడా ఇలాగే స్కూళ్లల్లో టిడిపి నేతల ప్రమేయం ఉంది. రెండుచోట్ల ఇలాంటి దాష్టీకాలే జరిగాయి. తాజాగా నాగార్జునసాగర్‌లో రవి అనే ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం…అది తట్టుకోలేక ఆయన భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచివేసింది.నిజానికి జీతాలు ఇవ్వని స్కూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించింది. లక్షలాది మంది టీచర్లు రోడ్డున పడ్డా చర్యలు తీసుకోలేదు. సాగర్‌లో స్కూల్‌ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు పెట్టాల్సి ఉన్నా పట్టించుకోలేదు. కారణం పైన చెప్పినట్లుగా అంతా అధికార పార్టీకి చెందిన అనుయాయులే కావడం అన్న విమర్శలు ఉన్నాయి. అలాగే ముక్కుపిండి ఫీజు వసూలు చేస్తుంటే తల్లిదండ్రులు రోడ్డెక్కినా చర్యలకు ఉపక్రమించలేదు. నిజానికి కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వం ఉందన్న విశ్వాసం కల్పించాల్సిన పెద్దలు మిన్నకుండిపోయారు. ప్రభుత్వ అండదండలతో మారుమూల గ్రామాల్లో సైతం ప్రైవేట్‌ స్కూళ్ల వ్యాపారం మూడుపూవులు ఆరుకాయలుగా నడుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన కేజీ టూ పీజీ పథకం పట్టాలకు ఎక్కక పోవడానికి కూడా ప్రైవేట్‌ స్కూళ్లే కారణమని వేరుగా చెప్పాల్సిన పనిలేదు. దానిపై ప్రకటనలు తప్ప చిత్తశుద్ధి కనపడటం‌ లేదు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం లేకపోవడం గ్రామీణ విద్యార్థులకు శాపంగా మారింది. కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ బోధించే టీచర్లు కూడా లేకపోవడం కారణంగా ప్రైవేట్‌ స్కూళ్లకు ఓ వరంగా మారింది. ఓ రకంగా ప్రభుత్వ పాఠశాలల లోపాలు ప్రైవేట్‌ స్కూళ్లకు కలిసి వస్తోంది. ఇదంతా చిత్తశుద్ది లేకుండా కావాలని నడిపించే కథలా సాగుతోంది. ఏపి లో పట్టుబట్టి స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం ప్రవేశ పెట్టడం ద్వారా ప్రైవేట్‌ దోపిడీకి అడ్డుకట్ట వేసినట్లు కనిపించినా క్షేత్రస్థాయిలో అధికారుల ఉదాసీన వైఖరి వలన‌‌ దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు. కరోనా సృష్టించిన విలయంలో ప్రభుత్వం విద్యారంగంపై సమగ్ర సమీక్ష చేసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజు దోపిడీపై నియంత్రణకు సంబంధించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ప్రభుత్వం వేసిన కమిటీ నివేదిక సమర్పిం చడంతో ఫీజుల అదుపుపై తల్లిదండ్రులు ఆశగా చూస్తున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో నడుస్తున్న ప్రైవేట్‌ స్కూళ్లలో సైతం వేలల్లో ఫీజులి వసూలు చేస్తున్నారు. ఇకపోతే మోడల్‌,టెక్నో స్కూళ్ల సంగతి చెప్పనక్కరలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే తమ పిల్లల భవిష్యత్‌ ఎక్కడ దెబ్బతింటుందో అన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఇంగ్లీష్‌ మోజులో పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లకు పంపిస్తున్నారు. అరకొర వసతులు ఉన్నా, సరైన శిక్షణ ఉన్న టీచర్లు లేకున్నా తల్లిదండ్రులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి ప్రైవేట్‌ పాఠశాల సమాంతరంగా వస్తువుల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. డ్రెస్సులు,పుస్తకాలు, టైలు, పెన్నులు, పెన్సిళ్లు ఇలా అన్నీ ఒకేచోట పెట్టి వ్యాపారం చేస్తున్నాయి. సరైన వసతులు లేకున్నా తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోకుండా ప్రైవేట్‌ ఆకర్షణలో రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల చదువుకు లెక్కలు కడుతున్నారు.ఈ క్రమంలో సిఎం కెసిఆర్‌ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్లకు 25 కిలో బియ్యం, 2వేల నగదు అందించాలని నిర్ణయించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇది నదిలో కొట్టుకు పోతున్న వారికి గడ్డిపోచలాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పని ఏడాది క్రితమే చేయాల్సింది. అలాగే ఇప్పటికైనా వెనక్కి తగ్గకుండా స్కూళ్ల అక్రమాలపై చర్యలు తీసుకోవాలి. జీతాలు ఇవ్వకుండా ఫీజు వసూలు చేసినందుకు క్రిమినల్‌ కేసులు పెట్టాలి. కరోనా దెబ్బకు కకావికలమైన ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పనిచేసే టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వం అండగా నిలిచిందని నిరూపించుకోవాలి. జీతాల్లేక తిండికి సైతం తన్లాడుతున్న వారిని అదుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించి, స్కూళ్లు మళ్లీ తెరిచే వరకూ వారికి నెకు రూ.2 వేల చొప్పున ఆపత్కాల ఆర్థిక సాయంతోపాటు కుటుంబానికి నెలకు ఉచితంగా 25 కిలో రేషన్‌బియ్యం పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించడం ద్వారా వారిలో ఆత్మస్థయిర్యాన్ని నింపారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో వాటిని ఆపడానికి ప్రయత్నించారనే చెప్పాలి. ఆపదలో ఉన్నవారి కుటుంబాలను మానవీయ దృక్పథంతో ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. అర్హులైనవారు బ్యాంక్‌ ఖాతా, ఇతర వివరాలతో వారివారి జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాని సూచించారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను ఖరారుచేయాలని ఆదేశించారు. సీఎం నిర్ణయంతో గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యాసంస్థల్లోని సుమారు 1.50 లక్ష మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి లబ్ది చేకూరనున్నది. రూ.2వే ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం సుమారు 30 కోట్లు వెచ్చించనున్నది. అయితే ఫీజులు వసూలు చేసినా ఎందుకు జీతాలు ఇవ్వడం లేదో అడిగే హక్కు ప్రభుత్వానికి ఉంది. అది చేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్దిని చాటాలి. చట్టాలను ఉల్లంఘించిన స్కూల్‌ యాజమాన్యా లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *