మా గురించి

మనిషి జననం నుండి మరణం దాకా ప్రతి గమనం ప్రతి గమ్యం ,ప్రతి నడక ,ప్రతి పయనం అన్ని ప్రకృతిలోనే మమేకం. లక్షల సంవత్సరాల మానవ మనుగడకు పుణ్యస్థలి భూమి.భువి నుండి దివి అంచుల వరకు చేరిన మానవ మేధస్సు. నేలతల్లి పురిటినొప్పుల నుండే మొదలైంది.దేశాల మధ్య అంతరాలను చెరిపిన ప్రపంచీకరణ అనుబంధం,నేలతల్లి అనుబంధాలను, ఆత్మీయతలను పేగు బంధాలు తెంపి భూమిపుత్రుడే గర్భశోకాన్ని మిగిల్చాడు.నేలతల్లి చేత ఆర్థనాద గీతికల్ని పలికిస్తున్నాడు.

అమృతతుల్యమైన నీరు!
స్వర్గ సమమైన చెట్లు !
మనిషిని నాగరికుడిగా మార్చిన నిప్పు !
అందాలను ఆస్వాదించే మనిషికి
ఆహ్లాదాన్ని అందించే రమణీయ, కమనీయ,
సుగంధ పరిమళాల సొగసులద్దే సుమధుర మకరందమైన
ప్రకృతి లోని అనువనువు భూమిదే.
మనిషి జననం భూమి
మరణం భూమి
కదలిక భూమి
ఆహారం భూమి
ఆనందం భూమి
ఆరోగ్యం భూమి
మనిషికి అమ్మ, నాన్న, గురువు, దైవం అన్నీ భూమే.
మనిషి చుట్టూ అల్లుకున్న ప్రతి వలయం భూమి. మొత్తంగా మనిషి భూమి తల్లికి అసలైన వారసుడు.
అణువణువు నేలనే ఇముడ్చుకుని
పుట్టిన “భూమి పుత్రుడు” మనిషి .
పుత్రుడంటే పున్నామ నరకం నుండి రక్షించేవాడే కాదు,
పుత్రుడు అంటే తల్లి రక్షకుడు,
సంరక్షకుడు ఆ తల్లికి సిసలైన వారసుడు.
నేల చేత పుట్టిన భూమిపుత్రుడు
అంతిమంగా నేల ఒడిలోనే చేదతీరతాడు.
సర్వ సంపదల కల్పవల్లి!
సర్వరోగ నివారిణి ఆయుర్వేద అమృతవల్లి!
మన భూమి తల్లి !.
మనిషి తన స్వార్థం కోసం ప్రకృతిలో అల్లకల్లోలం సృష్టించి
కన్న తల్లి పుడమికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. తరతరాల అంతరాలను దాటి
సమస్త జీవకోటి జీవన మనుగడ కోసం
తన తనువంతా త్యాగాల గాయాలను చేసుకుని
తన కోసం ఆలోచించే హృది కోసం
పరితపిస్తుంది భూమి తల్లి.
మనిషి తన అనంత జీవన ప్రస్థానంలో
ఎన్ని విజయ ప్రహసనాలు దాటాడు .
గ్రహాంతరాలు దాటి తన విజయపు జెండాను నాటాడు .
ఈ పరంపరలో తన కోసం తన ఉనికి కోసం సర్వస్వం అర్పించిన పుడమి తల్లి గమనానికి గండి కొట్టాడు మనిషి .తన స్వార్థం కోసం ,తన వారసుల కోసం
తన అస్తిత్వానికి కారణమైన నేలను నిలువునా దోచాడు.
హద్దులు లేని తన స్వార్ధ వలయంలో
నేలతల్లిని విలవిలలాడిస్తున్నాడు.
తన విష కోరలతో ప్రకృతిని కాటేస్తున్నాడు.
భవిష్యత్తు అంటే భయం లేదు!
రేపటి తరం పై బాధ్యత లేదు!
పుడమిపై జాలి లేదు!
తన రక్షణ వలయాన్నే చిదిమేస్తూ
తనకు తానే మరణశిక్ష విధించుకుంటున్న నయవంచకుడు మనిషి .ఆ మనిషి స్వార్ధ మత్తు దించే
గమ్మత్తయిన నూతన జగత్తు సృష్టికి
అంకురార్పణ చేస్తుంది మన “భూమిపుత్ర”..
మనిషి ఆలోచనలలోని
విషబీజాలలో మానవత్వపు పరిమళాలను అద్దేందుకు
నడుము కట్టింది “భూమిపుత్ర”
సమస్త జీవకోటి, భూమి తల్లి బిక్ష .ఆ తల్లి సుభిక్షం అయితేనే మన జీవితానికి సురక్ష. ప్రజ్వలితమైన నేలతల్లి ఆక్రందనలకు అక్షరరూపం “భూమిపుత్ర”.ప్రకృతిలోని ప్రతి ఆకృతికి నిత్య చైతన్య దీపిక “భూమిపుత్ర”.
భవ్య జగతికి దివ్య సూత్రధారి “భూమిపుత్ర”.
కలుషితమవుతున్న పర్యావరణం కడుపు మంటల జ్వాల “భూమిపుత్ర”.
ఇది
ఓ ఆలోచన!
ఓ ఆక్రందన!
ఓ అక్షరాయుధం
ఓ విప్లవ గీతం
ఓ బాధ్యతల పరంపర
క్షయమౌవుతున్న ప్రకృతిని రక్షించే
అక్షర గీతమాలిక మన “భూమిపుత్ర”.
పర్యావరణ పతనంపై
రాజకీయ సామాజిక రుగ్మతలపై
కరవాలం జులిపించే కలఖడ్గం భూమిపుత్ర.
సామాజిక పతనాన్వేషణలోని రహస్యన్ని ఛేధించి!
రాజకీయ రంగుల చక్రాన్ని ప్రదర్శించి!
ప్రతి పౌరుడిలో బాధ్యతను పెంచి
రేపటికై నవ సమాజాన్ని ఆకాంక్షించే
సరికొత్త ప్రగతి పథం “భూమిపుత్ర”.
భూమిని సంరక్షించే ప్రయత్నమే కాకుండా
భూమిని,
అధికారాన్ని,
ఆధిపత్యాన్ని అడ్డుపెట్టుకొని
సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాలలో జరిగే
ప్రతి అన్యాయాన్ని
అవినీతిని,అవకాశవాదాన్ని ప్రశ్నించే గొంతుక మన” భూమిపుత్ర”.