నా బిడ్డను నాకు ఇప్పించండి

 నా బిడ్డను నాకు ఇప్పించండి
భూమిపుత్ర,అనంతపురం: డబ్బు కోసం నిత్యం వేధించడమే కాకుండా రెండేళ్ల తన కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లిన తన భర్త, ఆయన బంధువులపై చర్యలు తీసుకోవాలని… ఆ చిన్నారిని తనకు అప్పగించాలని బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబుకు విజ్ఞప్తి చేసింది. జిల్లా ఎస్పీ ఇందుకు వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ చిన్నారిని ఇప్పించి ఆమెకు న్యాయం చేయాలని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ , కొత్తచెర్వు సి.ఐ నరసింహారావులను ఫోన్లో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఆ మహిళను ప్రత్యేక పోలీసు వాహనంలో ధర్మవరం డీఎస్పీ కార్యాలయానికి పంపారు.
ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలమూలల నుండీ విచ్చేశారు. మొత్తం 89  పిటీషన్లు స్వీకరించారు. ప్రతీ పిటీషనర్ తో జిల్లా ఎస్పీ ముఖాముఖిగా మాట్లాడారు. పిటీషనర్ల కోసం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ప్రత్యేక గుడారం ఏర్పాటు చేశారు. భౌతిక దూరం పాటించేలా సీటింగ్ … శ్యానిటైజర్ అందుబాటులో ఉంచారు. పోలీసు పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. 
జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఈరోజు  నిర్వహించిన స్పందనలో ప్రజల సమస్యల పరిష్కారానికి బాధ్యతాయుతంగా కృషి చేశారు. పలు రకాల బాధలు/సమస్యలుతో ప్రజలు స్పందన కార్యక్రమానికి వచ్చారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల గొడవలు, ఉద్యోగ మోసాలు, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి మోసం చేయడం… ఇలా ఎన్నో రకాల వినతులు పోలీసులకు అందాయి. పిటీషనర్ల పట్ల పోలీసులు జవాబుదారీ తనంగా వ్యవహరించారు. సమస్యలు స్వేచ్ఛగా చెప్పుకునేందుకు అవకాశం కల్పించారు. మర్యాద పూర్వకంగా వ్యవహరించి బాధితుల వినతులకు రసీదులు ఇచ్చి పంపారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఉమా మహేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *