తిరుపతి పార్లమెంట్ లో రత్న”ప్రభ వించేనా”?

 తిరుపతి పార్లమెంట్ లో రత్న”ప్రభ వించేనా”?

భూమిపుత్ర,తిరుపతి:
తిరుపతి పార్లమెంట్ సభ్యుడైన బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ పలుపేర్లను పరిశీలించిన అనంతరం కర్ణాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్ పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత ఆమె బీజేపీ లో చేరారు.

తాజాగా తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడినట్టయింది. కాగా, ఈ స్థానం కోసం మాజీ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరు కూడా పరిశీలనలోకి వచ్చినట్టు తెలిసింది. అయితే రత్నప్రభను అభ్యర్థిగా ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్… దాసరి శ్రీనివాసులుకు ప్రచార కమిటీలో స్థానం కల్పించింది.రత్నప్రభకు ఫైర్ బ్రాండ్ అధికారిణి అని, ముక్కుసూటిగా వ్యవహరిస్తారని గుర్తింపు ఉంది. వైసీపీ, టీడీపీలకు దీటుగా ఉండాలంటే రత్నప్రభ వంటి వ్యక్తి సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *